ప్రపంచమంతా కరోనా వైరస్ దెబ్బకు గజగజ వణికిపోతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే రాష్ట్రంలోని తెలుగుదేశంపార్టీకి మాత్రం కొత్త తరహా వైరస్ సోకినట్లు అనుమానంగా ఉంది. అదే జంపింగ్ వైరస్. స్దానిక సంస్ధల ఎన్నికలు తెలుగుదేశంపార్టీ మెడకు చుట్టుకుంటుందని బహుశా చంద్రబాబునాయుడు ఏనాడూ ఊహించుండడు. అందుకనే ఒకపుడు స్ధానిక సంస్ధల ఎన్నికలు నిర్వహించాలంటూ పదే పదే జగన్మోహన్ రెడ్డిని చాలెంజ్ చేసిన చంద్రబాబు ఇపుడు ఎన్నికలు వాయిదా వేయించాలంటూ పదే పదే డిమాండ్లు చేస్తున్నాడు.

 

ఏ ముహూర్తంలో ఎన్నికలు పెట్టమని డిమాండ్ చేశాడో కానీ ప్రపంచమంతా కరోనా దెబ్బకు వణికిపోతున్నట్లుగా చంద్రబాబు జంపింగ్ వైరస్ దెబ్బకు వణికిపోతున్నట్లే ఉంది. గడచిన మూడు రోజులుగా తెలుగుదేశంపార్టీలోని సీనియర్ నేతలు సుమారుగా పదిమంది రాజీనామాలు చేసి వైసిపిలో చేరిపోయారు. వైసిపిలో చేరిన వారందరూ మాజీ మంత్రులు, మాజీ ఎంఎల్ఏలుగా పనిచేసిన వారే అన్నది గుర్తుంచుకోవాలి.

 

ఇదే వరసలో మరో నలుగురు సీనియర్ నేతలు కూడా పార్టీకి రాజీనామా చేసేశారు. వీళ్ళింకా ఏ పార్టీలోను చేరలేదు లేండి. కాకపోతే వైసిపి కండువా కప్పుకోవటానికి రెడీ అయిపోయినట్లే అర్ధమవుతోంది. ఇప్పటికి తేలిన సంఖ్య మాత్రమే ఇది. మరో రెండు రోజులు పోతే ఇంకెంతమంది నేతలు బయటకు వచ్చేస్తారో ఎవరూ చెప్పలేకపోతున్నారు. అసలు ఏరోజు ఏ నేత పార్టీకి రాజీనామా చేయబోతున్నారో కూడా చంద్రబాబు అంచనా వేయలేకపోతున్నాడు.

 

రాజీనామాలు చేసి వైసిపిలో చేరిన వారు, రాజీనామాలు చేసిన వారు కూడా రాయలసీమ, కోస్తా జిల్లాలకు చెందిన వారే ఎక్కువమందున్నారన్న విషయం గమనించాలి. ఉత్తరాంధ్ర నుండి ఇప్పటికి పార్టీకి రాజీనామాలు చేసింది నలుగురు నేతలు మాత్రమే. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే  రాజీనామాలు చేసిన నేతల్లో  ఎక్కువమంది బిసి సామాజికవవర్గానికి చెందిన వారితో పాటు కమ్మ సామాజికవర్గం నేతలు కూడా ఉన్నారు. కడప నుండి రాజీనామాలు చేసిన నేతలు ఇద్దరు రెడ్లు మాత్రమే. మొత్తానికి స్ధానికసంస్ధల ఎన్నికలే చంద్రబాబు కొంప ముంచేస్తాయేమో ?

 

మరింత సమాచారం తెలుసుకోండి: