క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో పబ్లిక్‌ మీటింగ్‌లపై కర్ణాటక ప్రభుత్వం నిషేదాజ్ఞలు విధించింది. సీఎం యెడియూరప్ప అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి.. కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సమావేశం అనంతరం సీఎం యెడియూరప్ప మీడియాతో మాట్లాడారు. శ‌నివారం నుంచి వార రోజుల పాటు మాల్స్‌, విద్యాసంస్థలు, థియేటర్లు, నైట్‌ క్లబ్‌లు, పబ్‌లు, స్విమ్మింగ్‌ఫూల్స్‌ను మూసివేయనున్నట్లు సీఎం ప్రకటించారు. వివాహాలు, క్రీడా పోటీలు, సదస్సులు వాయిదా వేసుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ, ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా నడుస్తాయని సీఎం యెడియూరప్ప స్పష్టం చేశారు.

 

కాగా, ప్ర‌భుత్వ ఆదేశాల నేప‌థ్యంలో బెంగళూరులో ఈ నెల 15 నుంచి 17 వరకు తలపెట్టిన అఖిల్‌ భారతీయ ప్రతినిధి సభ సమావేశాలను రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) రద్దు అయ్యాయి. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా  ఆర్‌ఎస్‌ఎస్‌ సమావేశాలను రద్దు చేస్తున్నట్లు సంఘ్‌ ప్రధాన కార్యదర్శి భయ్యాజీ జోషి తెలిపారు. కాగా, బెంగళూరులో ఆర్‌ఎస్‌ఎస్‌ సమావేశాలకు బీజేపీ స‌ర్కారు నిబంధ‌నే అడ్డుప‌డింద‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.

 

ఇదిలాఉండ‌గా, కర్ణాటకలో కరోనా పాజిటివ్‌ కేసులు ఐదు నమోదు అయ్యాయి. ఈ ఐదుగురిలో గూగుల్‌ ఉద్యోగి కూడా ఉన్నాడు. మ‌రోవైపు కరోనా వైరస్‌తో 76 ఏళ్ల వృద్ధుడు మృతి చెందిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఈ క్ర‌మంలోనే వారం రోజుల మూసివేత నిర్ణ‌యం వెలువ‌డింది.

 


మ‌రోవైపు  ఈ నెల 21 నుంచి రెండు రోజులపాటు ప్రధానమంత్రి న‌రేంద్ర‌ మోదీ గుజరాత్‌లో పర్యటించాల్సి ఉండగా, కరోనా కారణంగా అది వాయిదా పడింది. కాగా, ఈ మ‌హ‌హ్మారిపై దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార సమాఖ్య దేశాలకు ప్రధానమంత్రి మోదీ కీల‌క‌ పిలుపు ఇచ్చారు.  కరోనా మహమ్మారిపై ఉమ్మడిగా పోరాడేందు బలమైన వ్యూహాన్ని రచించేందుకు భాగస్వామ్య దేశాల అధినేతలందరూ వీడియా కాన్ఫరెన్స్‌ ద్వారా చర్చిద్దామని ఆయ‌న‌ ప్రతిపాదించారు. దీనిపై పాకిస్థాన్‌ మినహా మిగిలిన అన్ని సభ్యదేశాల నుంచి సానుకూల స్పందన లభించింది. మోదీ ప్రతిపాదనను శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స, నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలి,  మాల్దీవులు అధ్యక్షుడు ఇబ్రహీం అహ్మద్‌ సోలీ,  భూటాన్‌ ప్రధాని లోటే షెరింగ్‌,  బంగ్లాదేశ్‌ విదేశాంగ మంత్రి షహ్రియార్‌ ఆలం,  ఆఫ్ఘనిస్థాన్‌ అధ్యక్షుడి అధికార ప్రతినిధి స్వాగతించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: