ప్రపంచంలోని దేశాలన్నింటినీ కరోనా మహమ్మారీ వణికిస్తున్న విషయం తెలిసిందే. కరోనా దెబ్బకు ఇప్పటికే చాలా కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. తాజాగా కరోనా ప్రభావం భారత ఐటీ కంపెనీలపై పడింది. కరోనా సోకకుండా ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఇన్ఫోసిస్ సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా సోకుతుందనే భయంతో బెంగళూరులోని ఇన్ఫోసిస్ కార్యాలయ భవనాన్ని ఖాళీ చేసింది. 
 
కార్యాలయంలోని కొంతమంది ఉద్యోగులకు కరోనా సోకినట్లు అనుమానాలు వ్యక్తం కావడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. బెంగళూరు డెవలప్ మెంట్ సెంటర్ హెడ్ గురురాజ్ ఉద్యోగుల భద్రత కోసమే తాము ఈ పని చేశామని చెప్పారు. తాము ఉద్యోగుల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని, రక్షణ కోసం ప్రాంతాన్ని శానిటైజ్ చేస్తామని చెప్పారు. 
 
సోషల్ మీడియాలో కరోనా గురించి రకరకాల పుకార్లు వైరల్ అవుతున్నాయని ఆ వార్తలను నమ్మవద్దని ఆయన ఉద్యోగులను కోరారు. కరోనాను ఎదుర్కోవడానికి ఉద్యోగులు మద్దతు ఇవ్వాలని, అవసరమైతే కంపెనీ గ్లోబల్ హెల్ప్ డెస్క్ నంబర్లకు కాల్ చేయాలని సూచించారు. కర్ణాటక ప్రభుత్వం కరోనాను ఎదుర్కోవడానికి ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇవ్వాలని ఐటీ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. 
 
ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో కంపెనీ ఆ దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. కరోనా ప్రభావం ఐటీ రంగంతో పాటు ఆటో పరిశ్రమ, ఎఫ్ఎంసీజీ, ఇతర రంగాలపై పడుతోంది. వైరస్ ప్రభావం ప్రస్తుత క్వార్టర్ తో పాటు వచ్చే ఆర్థిక సంవత్సరంలోను ఉంటుందని తెలుస్తోంది. ఐటీ సంస్థల క్లయింట్లపై కరోనా ప్రభావం ఉంటుందని, బిజినెస్ దెబ్బ తింటే క్లయింట్లు ఐటీ వ్యయాలను తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయని ఐటీ నిపుణులు చెబుతున్నారు.                          

మరింత సమాచారం తెలుసుకోండి: