నిజామాబాద్ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ స్థానానికి గురువారం కేంద్ర ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్‌ను విడుద‌ల చేయ‌డంతో జిల్లాలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా వేడెక్కింది. మాజీ ఎమ్మెల్సీ భూప‌తిరెడ్డి స‌స్పెన్ష‌న్‌కు గుర‌వ‌డంతో  ఖాళీ అయిన ఈ స్థానం ఎవ‌రికి ద‌క్కుతుంద‌నే ఉత్కంఠ నెల‌కొంది. ఈనెల 19 వ‌ర‌కు నామినేష‌న్లు స్వీక‌రించ‌నుండ‌గా,  ఏప్రిల్ 7న పోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. అయితే ఈ ప‌ద‌విపై అధికార పార్టీకి చెందిన సీనియ‌ర్ నేత‌లు ఆశ‌లు పెట్టుకున్నారు. వీరిలో ప్ర‌ధానంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూతురు, మాజీ ఎంపీ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది.  ఆమెతోపాటు మాజీ మంత్రి మండ‌వ వెంక‌టేశ్వ‌ర్‌రావుతోపాటు ఇత‌ర పేర్లు కూడా తెర‌పైకి వ‌స్తున్నాయి. వీరంతా హైకమాండ్ ఆశీస్సుల కోసం ఇప్ప‌టికే త‌మ వంతు ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేస్తున్నారు. 

 

అయితే ఎమ్మెల్సీ కాల‌ప‌రిమితి కేవ‌లం 24నెల‌లు మాత్ర‌మే ఉండ‌టంతో పోటీ చేసేందుకు పెద్ద నాయ‌కులెవ‌రూ ఆస‌క్తి చూప‌డంలేదు. మొన్న‌టి వ‌ర‌కు ఉమ్మ‌డి జిల్లా నుంచి మాజీ ఎంపీ క‌ల్వ‌కుంట్ల కవిత‌, మాజీ స‌భాప‌తి కే ఆర్ సురేశ్‌రెడ్డి, మాజీ మంత్రి మండ‌వ వెంక‌టేశ్వ‌ర్‌రావు రాజ్య‌స‌భ సీట్ల‌ను ఆశించారు. అయితే అనూహ్యంగా కేఆర్ సురేశ్‌రెడ్డిని అదృష్టం వ‌రించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్య‌స‌భ అభ్య‌ర్థిగా కేఆర్ సురేశ్‌రెడ్డి పేరును ప్ర‌తిపాధించ‌డంతో సమీక‌ర‌ణాలు ఒక్క‌సారిగా మారిపోయాయి.  ఇక రాజ్య‌స‌భ సీటు ద‌క్క‌క‌పోవ‌డంతో నిరాశ చెందిన మాజీ మంత్రి మండ‌వ వెంక‌టేశ్వ‌ర్‌రావు కూడా ఎమ్మెల్సీ ప‌ద‌విపై అంత‌గా ఆస‌క్తి క‌న‌బ‌ర్చ‌డంలేద‌ని తెలుస్తోంది. 

 

ఈ క్ర‌మంలోనే ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు ర‌వీంద‌ర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, నిజామాబాద్  టీఆర్ ఎస్ అధ్య‌క్షుడు ఈగ గంగారెడ్డి, కామారెడ్డి టీఆర్ ఎస్ అధ్య‌క్షుడు ముజిబుద్ధీన్‌, బోధ‌న్‌కు చెందిన అమ‌ర్‌నాథ్ బాబు మాత్ర‌మే ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలు స్తోంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ పార్టీ అధినేత కేసీఆర్ అభ్య‌ర్థి ఎవ‌ర‌నేది ఇంకా నిర్ణ‌యించ‌లేద‌ని స‌మాచారం. నామినేష‌న్ల ముగింపు గ‌డువు ద‌గ్గ‌ర‌ప‌డుతుండంతో నేడో రేపో అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: