తెలంగాణ ప్రభుత్వం కరోనా వైరస్ పై అలర్ట్ అయింది. ఈరోజు సాయంత్రం కరోనా గురించి చర్చించడానికి కేబినెట్ భేటీ కాబోతుంది. అసెంబ్లీలో కరోనా గురించి కేసీఆర్ మాట్లాడుతూ బయటి దేశాల నుంచి వచ్చినవారే రాష్ట్రానికి కరోనాను తీసుకొస్తున్నారని చెప్పారు. చాలా రాష్ట్రాలలో ఇప్పటికే థియేటర్లు, మాల్స్ మూసివేస్తున్నారని తెలిపారు. ఏడు దేశాల నుంచి ప్రయాణికులను అనుమతించొద్దని కేంద్రం ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు. 
 
హైదరాబాద్ లో అంతర్జాతీయ ప్రయాణికులు పెరుగుతున్నారని చెప్పారు. ప్రతి వందేళ్లకు ఒకసారి వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోందని వ్యాఖ్యలు చేశారు. వందేళ్ల క్రితం వైరస్ బారిన పడి నాలుగు లక్షల మంది చనిపోయారని చెప్పారు. దేశంలో ఇప్పటివరకు 65 మందికి కరోనా సోకిందని ప్రకటన చేశారు. వారిలో 17 మంది విదేశీయులని చెప్పారు. ఇప్పటివరకు 10 మంది కరోనాను జయించగా ఇద్దరు మృత్యువాత పడ్డారని తెలిపారు.
 
ఇటలీ నుంచి వచ్చిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలిందని... ఆయనకు గాంధీలో చికిత్స అందిస్తున్నారన్నారు. ఇద్దరు అనుమానితుల రిపోర్టులు ఇంకా రావాల్సి ఉందని చెప్పారు. దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో హైదరాబాద్ ఒకటని అందువల్ల ఎయిర్ పోర్టులో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. విదేశాల నుండి వస్తున్న వారికి స్క్రీనింగ్ చేస్తున్నామని తెలిపారు. 
 
ఈరోజు సాయంత్రం అత్యవసర కేబినెట్ భేటీని నిర్వహించనున్నట్లు కేసీఆర్ తెలిపారు. కేబినెట్ సమావేశంలో థియేటర్లు, కాలేజీలు, స్కూళ్ల మూసివేతపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం కరోనాపై హై లెవెల్ కమిటీ సమావేశం జరుగుతోందని అన్నారు. హై లెవెల్ కమిటీ నిర్ణయం తరువాత కేబినెట్ సమావేశంలో కరోనాను ఎదుర్కొనేందుకు తీసుకునే చర్యలపై చర్చిస్తామని తెలిపారు.                                    

మరింత సమాచారం తెలుసుకోండి: