ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అటవీ శాఖలో ప్రక్షాళన మొదలైందా?అక్రమార్కులతో దోస్తీ చేసే సిబ్బందిపై వేటు పడుతుందా? జిల్లాలో వరుస సస్పెన్షన్లు దేనికి సంకేతం? విజిలెన్స్ టీమ్ తయారు చేసిన చిట్టాలో ఎంతమంది పేర్లున్నాయ్? అసలు...ఈ స్థాయిలో అటవీ సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవటానికి కారణం ఏంటి?

 

ఆదిలాబాద్‌కు అడవుల జిల్లాగా పేరుంది. స్మగ్లర్ల గొడ్డలి వేటు, అక్రమార్కుల ధన దాహానికి జిల్లాలో అటవీ విస్తీర్ణం తగ్గిపోతోంది. కలప స్మగ్లర్లు...కొంతమంది అక్రమార్కులతో అటవీ సిబ్బంది చేతులు కలుపుతున్నారు. ఇది గుర్తించిన ఉన్నతాధికారులు ప్రక్షాళన మొదలుపెట్టారు. గతంలో వరుస పులుల హత్యలు, కలప స్మగ్లింగ్‌లో అధికారులపై అనేక ఆరోపణలొచ్చాయి. ఆ మధ్య కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారులందరిని బదిలీ చేశారు. జిల్లాలో కింది స్థాయి సిబ్బంది మాత్రం అలాగే పాతుకపోయారు. 

 

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కవ్వాల్ టైగర్ జోన్, కదంబ ఫారెస్ట్ ఉంది. పచ్చని అడవులు మైదానాలుగా మారిపోతున్నాయి. దీనికి కారణమైన ఇంటి దొంగల పని పడుతున్నారు. ఇప్పటికే విజిలెన్స్ టీమ్ ఉమ్మడి జిల్లాలోని 78 మంది సిబ్బందికి కలప స్మగ్లర్లతో సంబంధాలున్నాయని తేల్చింది. దీనిపై నివేదిక సైతం తయారు చేసినట్టు తెలుస్తోంది. తాజాగా కాగజ్‌నగర్‌లో ఓ డిప్యూటి రేంజర్‌పై వేటపడింది. ఈమధ్య కాలంలో 20 నుంచి ముప్పై మంది సిబ్బందిపై వేటు వేసినట్టు సమాచారం. 

 

ఇక...తప్పు చేస్తే ఎవ్వరినీ ఉపేక్షించబోమని కవ్వాల్ టైగర్ జోన్ ఎఫ్‌డిపీటీ అంటున్నారు. ఇప్పటికైనా...ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పరిస్థితులు చక్కబడతాయో చూడాల్సిందే మరి. మొత్తానికి ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో ఇంటి దొంగల పని పట్టేందుకు చర్యలు మొదలయ్యాయి. కలప స్మగ్లర్లతో చేతులు కలిసి అక్రమ వ్యాపారం చేస్తున్నవారిని వదిలేది లేదని అధికారులు తేల్చిచెబుతున్నారు. కటకటాల వెనక్కి పంపేలా అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: