నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీ లైంగిక వేధింపులకు అడ్డాగా మారుతోంది. విద్యా బుద్ధులు నేర్పించాల్సిన గురువులే దారి తప్పుతున్నారు. పాఠాలు చెప్పాల్సిన ఫ్రొఫెసర్లే విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. కీచక ఫ్రొఫెసర్ల వేధింపులతో విద్యార్థినులు ఆందోళన చెందుతున్నారు. తమను లైంగికంగా వేధించిన ప్రొఫెసర్లపై చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు రిజిస్ట్రార్...జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇంతకీ...నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఏం జరుగుతోంది?

 

నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో విద్యార్థినులకు రక్షణ లేకుండా పోయింది. కొంతమంది ప్రొఫెసర్లు విద్యార్థినులను నిత్యం లైంగికంగా వేధిస్తున్నారు. పాఠాలు చెప్పి జీవితాలను తీర్చిదిద్దాల్సిన ఆచార్యులే నీతి తప్పి నీచంగా ప్రవర్తిస్తున్నారు. ఇంజినీరింగ్ కాలేజ్‌ వైస్‌ప్రిన్స్‌పల్‌గా పని చేస్తున్న పునీత్ కుమార్ కీచకుడి అవతారమెత్తాడు. ఇతగాడి అరాచకాలను భరించలేని ఓ విద్యార్థిని వర్సిటీ రిజిస్ట్రార్‌ యాదగిరి, జిల్లా ఎస్పీ రంగనాథ్‌కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసింది. సెల్‌ఫోన్‌కు బూతు మెసెజ్‌లు పంపిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని పునీత్‌కుమార్‌పై చేసిన ఫిర్యాదులో తెలిపింది. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కీచక అధ్యాపకుడు పునీత్‌ కుమార్ బాగోతంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 

 

ఇక...ఈ ఘటనతో యూనివర్సిటీకి రావాలంటేనే విద్యార్థినులు భయపడుతున్నారు. పునీత్ కుమార్ లైంగిక వేధింపులు భరించలేని విద్యార్థినులు తొలుత రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేశారు. అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. అతగాడి వేధింపులు మరింతగా పెచ్చుమీరిపోయాయి. దీంతో జిల్లా ఎస్పీ రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు. కీచక వైస్ ప్రిన్స్‌పల్ పునీత్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

 

పునీత్ కుమార్‌ ఆగడాలపై యూనివర్సిటీ రిజిస్ట్రార్ యాదగిరి ఆరుగురు సభ్యులతో కమిటీ వేశారు. కమిటీ నివేదిక ఆధారంగా పునీత్‌ కుమార్‌ను సస్పెండ్ చేశారు. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు యూనివర్సిటీ రిజిస్ట్రార్. 


 
అయితే...మహాత్మా గాంధీ యూనివర్సిటీలో గతంలోను ప్రొఫెసర్లు లైంగికంగా వేధించిన ఘటనలు ఉన్నాయని కొందరు విద్యార్థినులు చెబుతున్నారు. అధికారులకు పిర్యాదు చేస్తే కమిటీలు వేసి కాలయాపన చేసి ఎలాంటి చర్యలు తీసుకొలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళా ప్రొఫెసర్ల పట్ల కూడా కొందరు ప్రొఫెసర్లు అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలు ఉన్నాయి. వారిపైనా ఎలాంటి చర్యలు తీసుకోలేదు వర్సిటీ అధికారులు. ప్రొఫెసర్‌ల వేధింపులు బయటకు చెబితే తమ పరువు పోతుందని విద్యార్థినులు భయపడుతున్నారు. ఐతే...విద్యార్థినుల్లో భయం పోగొట్టేందుకు జిల్లా పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. యూనివర్సిటీలో షీ టీమ్స్‌తో అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు జిల్లా ఎస్పీ రంగ నాధ్. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: