వ్యవసాయదారుడుకి కాడి కదలాలంటే పశు సంపద కీలకం. అయితే మహబూబాబాద్ జిల్లాలో కొంతకాలంగా తమ కళ్ళ ముందే పశువులు వింత వ్యాధి సోకి అకాల మృత్యువాత పడుతున్నాయి. దాంతో వాటిని బతికించుకోలేక , ఏమి చేయాలో తెలియక అన్నదాతలు విలవిల్లాడుతున్నారు.

 

మహబూబాబాద్ జిల్లా  డోర్నకల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వింత వ్యాధి సోకి వందల సంఖ్యలో  పశువులు మృత్యువాత పడుతున్నాయి. పశువుల ఒంటిపై మొదట చిన్న చిన్న దద్దుర్లు గా ఏర్పడి 23 రోజులు గడిచేసరికి వాటి పరిమాణం పెరిగి పెద్ద గడ్డలుగా ఏర్పడుతున్నాయి. పుండ్లు పడి వాటి నుంచి సోనా కారుతున్నాయి. దీంతో  పశువులు అనారోగ్యానికి గురై మేత మేయక,  నీరసించి మృతి చెందుతున్నాయని రైతులు గొల్లుమంటున్నారు.   

 

వ్యాధి సోకిన దూడలు అధిక సంఖ్యలో మృతి చెందుతున్నాయి. మందులు వాడినా కూడా ఫలితం కనిపించడం లేదని రైతులు తెలిపారు. పశువులు,దూడలు చనిపోవడం వల్ల రైతులు, పశు పోషకులు ఆర్థికంగా చితికిపోతున్నారు. డోర్నకల్ ప్రాంతంలోని రైతులు ఎక్కువగా పశువుల మీదనే ఆధారపడి వ్యవసాయం చేస్తుంటారు. పశువులకు సోకుతున్న ఈ వ్యాధి గురించి వైద్యులు దృష్టికి తెచ్చామంటున్నారు రైతులు. మందులు, ఇంజెక్షన్లతో సరిపెడుతున్నారని, ఫలితం కానరావడం లేదని వాపోతున్నారు.      

 

పశు వైద్యులేమో.. పశువులకు వ్యాధి లంపి స్కిన్  గా గుర్తించామని చెబుతున్నారు. ఈ వ్యాధి పొరుగు రాష్ట్రాల నుంచి మన పశువులకు సోకిందన్నారు. పశువులు ఉండే స్థలాలలో పారిశుధ్యం లేకపోవడం వలన ఈ వైరస్ అధికంగా వ్యాపిస్తుందని పశువైద్యులు హెచ్చరించారు.,ఈ వ్యాధి సోకిన పశువులను, ఇతర పశువులతో కలవకుండా ఒంటరిగా ఉంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరిశ్రుభత, సరైన జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి వ్యాధులు సోకవని చెప్పుకొస్తున్నారు. మొత్తానికి రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తమకు వ్యవసాయంలో చేదోడువాదోడుగా ఉంటున్న పశువులు ఇలా మృత్యువాత పడటంపై లబోదిబోమంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: