స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైసీపీ ప్రభంజనం కొనసాగుతుంది. ఇప్పటికే ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి స్థానాలకు నామినేషన్ ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే. అయితే చాలాచోట్ల ప్రతిపక్ష టీడీపీ నామినేషన్స్ వేయలేక చేతులెత్తేసింది. దీంతో చాలా నియోజకవర్గాల్లో ఏకగ్రీవాలు ఎక్కువయ్యాయి. అవి కూడా వైసీపీ ఖాతాలో పడ్డాయి. ఈ క్రమంలోనే టీడీపీకి కంచుకోటగా ఉన్న గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో వైసీపీ సత్తా చాటింది.

 

గత పదేళ్లుగా వినుకొండ టీడీపీకి కంచుకోటగా ఉంటూ వస్తోంది. ఈ నియోజకవర్గంలో 2009, 2014 ఎన్నికల్లో వరుసగా టీడీపీ తరుపున జి‌వి ఆంజనేయులు విజయం సాధించారు. అయితే 2019లో మాత్రం ఆయనకు బొల్లా బ్రహ్మనాయుడు చెక్ పెట్టేశారు. వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన దాదాపు 28 వేల మెజారిటీతో గెలిచారు. ఇక సార్వత్రిక ఎన్నికల్లో జి‌వికు చెక్ పెట్టిన బొల్లా, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా చెక్ పెట్టడానికి సిద్ధమయ్యారు.

 

ఈ క్రమంలోనే నియోజకవర్గంలో 12 ఎం‌పి‌టి‌సి స్థానాల్లో ఏకగ్రీవంగా విజయం సాధించారు. 12 చోట్ల టీడీపీ అభ్యర్ధులు నామినేషన్ వేయకపోవడంతో, సింగిల్ నామినేషన్ వేసిన వైసీపీ అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వినుకొండ మండలంలో 5, నూజెండ్ల మండలంలో 3, బొల్లాపల్లి మండలంలో 4 స్థానాలు వైసీపీకి ఏకగ్రీవం అయ్యాయి.

 

అటు టీడీపీ బలంగా ఉన్న కృష్ణా జిల్లాలో కూడా వైసీపీ 7 స్థానాలు ఏకగ్రీవంగా దక్కించుకుంది. అయితే టీడీపీకి ఒకచోట ఏకగ్రీవమైంది. అవనిగడ్డ నియోజకవర్గంలో ఎదురుమొండి, రేమాలవారిపాలెం ఎంపీటీసీ స్థానాల్లో ప్రతిపక్షాలు నామినేషన్స్ ఉపసంహరించుకోవడంతో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవ మైనట్లు రిటర్నింగ్‌ అధికారి తెలిపారు. అటు కైకలూరు నియోజకవర్గంలో కోరుకొల్లు-2, వడాలి ఎం‌పి‌టి‌సి స్థానాలు వైసీపీ ఖాతాలో పడ్డాయి. అలాగే గుడివాడ నియోజకవర్గంలోని దండిగాని పూడి, బాపులపాడు మండలంలోని బొమ్ములూరు ఎం‌పి‌టి‌సి స్థానం కూడా వైసీపీ ఖాతాలోకి వెళ్లింది. అటు విజయవాడ రూరల్ మండలంలోని ప్రసాదంపాడు-3 వైసీపీకి ఏకగ్రీవం అవ్వగా, ప్రసాదంపాడు-2 టీడీపీ ఖాతాలో పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: