హైదరాబాద్‌ మాదిరిగానే వరంగల్ లోనూ మెట్రో రైలు పరుగులు తీయనుంది. ట్రై సిటీని అనుసంధానిస్తూ నిర్మించనున్న మెట్రో నియో రైలు ప్రతిపాదనలపై అధికార యంత్రాంగం దృష్టి కేంద్రీకరించింది. రాష్ట్ర పట్టణాభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌  చొరవతో మెట్రో రైలు ప్రాజెక్టుపై వడివడిగా అడుగులు పడుతున్నాయి.

 

హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్.  నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిచేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయడంతో పాటు పనులు వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటి రామారావు ఆదేశాలు జారీ చేశారు. వరంగల్ మహానగరంలోని పెండింగ్ పనులతో పాటుఎన్నో రోజులుగా పెండింగులో ఉంటున్న కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ మాస్టర్ ప్లాన్ కు  కేటీఆర్ ఆమోదం తెలిపారు.  

 

2020 నుంచి 2041 వరకు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేశారు. వరంగల్‌ నగరం రోజురోజుకు విస్తరిస్తోంది.  వరంగల్ నగరం అభివృద్ధి చెందుతున్న రీతిలో ఇక్కడ ప్రజారవాణా వ్యవస్థ లేదు..  ఆర్టీసీ సిటీ బస్సులు తగినన్ని లేకపోవడంతో ,  ప్రజలు ఎక్కువగా ఆటోలు, సొంత వాహనాల్లోనే తిరుగుతున్నారు, దీన్ని గుర్తించిన కేటీఆర్..  నగరంలో 15 కిలోమీటర్ల మేర,  హైదరాబాద్ తరహాలో మెట్రో రైల్ ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయాలని అధికారులను  ఆదేశించారు.  

 

క్షేత్ర స్థాయిలో అధికారులు అధ్యయనం కూడా పూర్తి చేశారు. కాజీపేట రైల్వేస్టేషన్‌ నుంచి పెట్రోల్‌ పంపు, హన్మకొండ చౌరస్తా, మలుగు రోడ్డు, ఎంజీఎం సెంటర్, పోచమ్మ మైదాన్, కాశిబుగ్గ, వెంకట్రామ జంక్షన్‌ మీదుగా వరంగల్‌ రైల్వేస్టేషన్‌ వరకు, అక్కడి నుంచి వరంగల్‌ స్టేషన్‌ రోడ్డు మీదుగా చౌరస్తా జేపీఎన్‌ రోడ్డు మీదుగా పోచమ్మ మైదాన్‌ వరకు ప్రధాన రహదారిని మెట్రో రైలు ప్రతిపాదన మార్గాలు, డీపీఆర్‌ ని సిద్ధం చేస్తున్నారు.

 

అన్ని కుదిరితే అతి త్వరలోనే వరంగల్ నగరంలో మెట్రో రైల్ ప్రాజెక్టు పనులు పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో పర్యటయించిన అధికారులు మెట్రో రైల్  ఫిజుబులిటీ ఉందని తేల్చారు.  పిపిపి ప్రాతిపదికన మెట్రో రైల్ ప్రాజెక్టు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: