తెలంగాణ హైలెవ‌ల్ క‌మిటీ భేటీ ఇప్ప‌టికే ముగిసింది. ఇక దీనిపై సాయంత్రం 6 గంట‌ల‌కు కేబినెట్ స‌బ్ క‌మిటీ భేటీ కానుంది. మార్చి 31 వ‌ర‌కు స్కూల్స్‌, కాలేజ్‌లు , మాల్స్ అన్నింటిని మూసి వేయ‌నున్నారు. ఇక థియేట‌ర్ల‌ను కూడా అదే తేదీ వ‌ర‌కు మూసి వేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇక క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో హైద‌రాబాద్‌తో పాటు ఇప్ప‌టికే తెలంగాణ వ్యాప్తంగా థియేట‌ర్ల‌కు ప్రేక్ష‌కులు రావ‌డం మానేశారు. దీంతో ఇటు ప్ర‌భుత్వం సైతం ఇప్పుడు ఇదే నిర్ణ‌యం తీసుకుంది.

 

ఇక ఈ వైర‌స్ వ్యాప్తి చెంద‌కుండా ప్ర‌భుత్వం మ‌రిన్ని చ‌ర్య‌లు తీసుకోనుంది. ఇక ఇప్ప‌టికే స్విమ్మింగ్ పూల్స్‌తో పాటు అంగ‌న్వాడీలు కూడా మూసేస్తున్నారు. ఇక ప‌శ్చిమ బెంగాల్ ప్ర‌భుత్వ సైతం మార్చి 31 వ‌ర‌కు థియేట‌ర్లు మూసి వేయ‌నున్నారు. క‌ర్నాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులో విద్యా సంస్థ‌లు, మాల్స్‌, ప‌బ్‌లు, కాలేజ్‌లు వారం రోజుల పాటు మూసి వేయ‌నున్నారు. హార్యానా, ఛ‌త్తీస్‌ఘ‌డ్‌, బిహార్‌, కేర‌ళ‌లో కూడా మార్చి 31 వ‌ర‌కు విద్యాసంస్థ‌ల‌కు సెల‌వులు ప్రక‌టించారు. మ‌హారాష్ట్ర‌లోని ప‌లు న‌గ‌రాల్లో మార్చి 31 వ‌ర‌కు మాల్స్‌, థియేట‌ర్లు బంద్ కానున్నాయి.

 

మార్చి 31వ‌ర‌కు ప‌రిస్థితి అదుపులోకి రాక‌పోతే ఆ త‌ర్వాత ఈ సెలవులు మ‌రి కొన్ని రోజులు కూడా పొడిగించే అవ‌కాశాలు ఉన్నాయి. మరో నాలుగు రోజుల్లో ఇంటర్‌ పరీక్షలు ముగియనున్న నేపథ్యంలోనే పరీక్షలను షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. పదో తరగతి పరీక్షలు కూడా షెడ్యూల్‌ ప్రకారం జరుగనున్నాయి. ఈ మేరకు కరోనాపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి ప్రస్తుత పరిస్థితిపై సమీక్షించారు.

 

ఏదేమైనా దేశ వ్యాప్తంగా క‌రోనా ఎఫెక్ట్‌తో అన్ని రాష్ట్రాల ప్ర‌భుత్వాలు హ‌డ‌లెత్తి పోతున్నాయి. ఎవ‌రికి వారు ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ? అన్న భ‌యం గుప్పెట్లో జీవ‌నం వెళ్ల‌దీస్తున్నారు. మ‌రి ఈ ప‌రిస్థితి ఎప్ప‌ట‌కి అదుపులోకి వ‌స్తుందో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: