గత కొంత కాలంగా దేశంలో ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతూనే ఉంది.  ఎక్కడో అక్కడ రహదారులు నెత్తురోడుతున్నాయి.  ఈ ఒక్కరోజే రాజస్థాన్..మహారాష్ట్ర, తమిళనాడుల్లో 20మంది చనిపోయారు.  రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. బలోత్రా - ఫలోడి హైవేపై వేగంగా వచ్చిన ట్రక్కు అదుపుతప్పి బొలెరో వాహనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.  మృతదేహాలను స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో బొలెరో వాహనం నుజ్జునుజ్జు అయింది.

 

క్రేన్‌ సాయంతో ట్రక్కును పక్కకు తీశారు పోలీసులు.  అతివేగం కారణంగా వాహనాలు అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.  ప్రమాదంలో జీపు.. ట్రక్ కిందకు దూసుకెళ్లింది. దీంతో అందులో ఉన్న ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. ఇదిలా ఉంటే.. తమిళనాడులోని నామక్కల్‌లో ఇవాళ ఉదయం రోడ్డుప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. నామక్కల్‌ వద్ద వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది.

 

అయితే ఇక్కడ మరణించిన వారు బీహారీలు అని పోలీసులు అంటున్నారు. మరోవైపు మహారాష్ట్ర రాజధాని ముంబయిలోనూ ఈ ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. వోర్లీ సమీపంలో కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, కారు నడుపుతున్న మహిళకు తీవ్ర గాయాలయ్యాయి.  ప్రతిరోజూ ఎన్నో రోడ్డు ప్రమాదాలు సంబవిస్తున్నాయి.  ఈ ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య ఆందోళనలకు గురిచేస్తోంది. బైటకు వెళ్లినవారు క్షేమంగా ఇంటికి తిరిగివస్తోరో లేదోననే ఆందోళన కలుగుతోంది. ఇలా  రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటంబాాలు రోడ్డున పడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: