తెలంగాణ సర్కారు కంది పంటకు మంచి గిట్టుబాటు ధర ప్రకటించింది. మార్కెట్‌లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించింది. పత్రాలు పరిశీలించిన తర్వాతే కంది కొనుగోళ్లు చేపట్టేలా అధికారులకు సూచనలు చేసింది. అయితే... క్షేత్రస్థాయిలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి. పొరుగు రాష్ట్రాల్లో కొనుగోలు చేసిన కందులను వ్యాపారులు...దళారులు అక్రమంగా మెదక్ జిల్లా మార్కెట్‌కు తీసుకొచ్చి దర్జాగా అమ్ముకుంటున్నారు. 

 

మెదక్ జిల్లాలో కంది రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్‌ క్యూలైన్లలో రోజుల తరబడి ఎదురు చూస్తున్నారు. ఐతే...మార్కెట్‌కు సరుకు తీసుకొచ్చిన వ్యాపారులు మాత్రం సరుకు ఈజీగా అమ్ముకొంటున్నారు. నారాయణ ఖేడ్ కందుల కొనుగోలు కేంద్రంలో రైతుల పేరుతో వ్యాపారులు...దళారులు అమ్ముకుంటున్నారు. అర్హులైన రైతులు మాత్రం తమ సరుకును అమ్ముకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. రోజుల తరబడి తూకం వేయడం లేదు. డబ్బులు ఉంటే మాత్రం వెంటనే పనులు అవుతున్నాయని కంది రైతులు ఆవేదన చెందుతున్నారు.

 

మరోవైపు...కర్ణాటక, మహారాష్ట్రలలో కొనుగోలు చేసిన కందులను సైతం వ్యాపారులు ఇక్కడికే తీసుకొచ్చి అమ్ముకుంటున్నారు. దళారులతో కుమ్మక్కవుతున్నారు. స్థానిక రైతులకు చెందిన పట్టాదారు పాసు పుస్తకాలు, ఏఈఓలు, వీఆర్ఓల ధ్రువీకరణ పత్రాలు పొందుతున్నారు. ఆయా రాష్ట్రాల్లో కందుల ధర 4 వేల 3 వందల ఉండగా ..ఇక్కడ ప్రభుత్వం 5 వేల 8 వందల రేటు ప్రకటించింది. దీంతో లాభాల కోసం మార్కెట్‌ను దళారి వ్యవస్థగా మార్చేశారు. కొనుగోలు కేంద్రాలు దగ్గర ఉదయం 8 గంటలకే పెద్ద క్యూ ఉంటుంది. వ్యాపారులు, దళారులు సరుకును వెనుక వైపు తూకం వేయిస్తున్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా రైతులు మాత్రం ఇక్కడే కాపలా కాస్తున్నారు. ఆర్డర్ ప్రకారం సీరియల్ నంబర్స్ ఇచ్చినా ఉపయోగం లేకుండా పోతోంది. 

 

ఇక...అధికారులు మాత్రం అన్ని పత్రాలు పరిశీలించిన తర్వాతే కందులు కొనుగోలు చేస్తున్నామని చెబుతున్నారు. ఎలాంటి అవకతవకలు జరగడం లేదని తెలిపారు. అలాంటివి ఏమైనా జరిగితే తమ దృష్టికి తీసుకురావాలని సూచిస్తున్నారు. 

 

 మొత్తానికి...ప్రభుత్వం గిట్టుబాటు ధర ప్రకటించినా వ్యాపారులు...దళారుల కారణంగా రైతులకు కష్టాలు తప్పటంలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిజమైన కంది రైతులకు న్యాయం జరిగేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: