ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు శనివారంతో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం పూర్తయింది. నామినేషన్ల పర్వం ముగిసేసరికి అధికార వైసీపీ జోరు ముందు విపక్ష తెలుగుదేశం పార్టీ అల్లాడి పోయింది. ఇక శనివారం నామినేషన్ల ఉపసంహరణ పూర్తయ్యేసరికి వైసిపి దాదాపు ఆరు జిల్లా పరిషత్ లు కైవ‌సం చేసుకునే దిశగా ముందుకు సాగుతోంది. రాయలసీమలోని కడప జిల్లాలో మెజార్టీ జడ్పీటీసీలు ఏకగ్రీవం కావడంతో ఇక్కడ జిల్లా పరిషత్ చైర్మన్ అధికార వైసీపీ ఖాతాలో పడింది. పులివెందుల మున్సిపాల్టీతో పాటు కడప కార్పొరేషన్ సైతం ఇప్పటికే వైసిపి ఖాతాలో పడ్డాయి. జమ్మలమడుగు రాయచోటి లోనూ ఇదే పరిస్థితి ఉంది. రాయలసీమలో చిత్తూరు, కర్నూలు జ‌డ్పీ చైర్మ‌న్ల‌తో పాటు ప‌క్క‌నే ఉన్న‌ నెల్లూరు ప్రకాశం జిల్లాలో మెజార్టీ జడ్పీటీసీలు వైసీపీ ఖాతాలో ఏకగ్రీవం అయ్యాయి.

 

క‌డ‌ప జిల్లాలో ఇప్ప‌టికే 35 జ‌డ్పీటీసీలు ఏక‌గ్రీవం అయ్యాయి. ఇక టీడీపీ కంచుకోట అయిన గుంటూరు జిల్లాలో కూడా 54 జ‌డ్పీటీసీల‌కు ఏకంగా 8 జ‌డ్పీటీసీలు ఏక‌గ్రీవం అయ్యాయి. ఇక చంద్ర‌బాబు సొంత జిల్లాలో టీడీపీ ప‌రిస్థితి ఘోరంగా ఉంది. మొత్తం 858 ఎంపీటీసీల‌కు గాను 232 స్థానాలు ఏక‌గ్రీవం అయ్యాయి. ఇక మొత్తం 65 జ‌డ్పీటీసీల‌కు గాను 15 జ‌డ్పీటీసీలు ఏక‌గ్రీవం అయ్యాయి. ఇక తిరుప‌తిలో 20 మంది వైసీపీ కార్పొరేట‌ర్లు ఏక‌గ్రీవం అయ్యాయి. ఇక బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో కూడా 4 ఎంపీటీసీలు ఏక‌గ్రీవం అయ్యాయి.

 

ఇక ప్ర‌కాశం, నెల్లూరు జిల్లాల్లోనూ వైసీపీ జ‌డ్పీటీసీలు, ఎంపీటీసీలు భారీ ఎత్తున ఏక‌గ్రీవం అయ్యాయి. ఇక ప‌శ్చిమ చిత్తూరు జిల్లాలో మ‌ద‌న‌ప‌ల్లి, తంబ‌ళ్ల‌ప‌ల్లి, పీలేరు, ప‌ల‌మ‌నేరు, పుంగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గాల్లో అయితే అస‌లు వైసీపీ అభ్య‌ర్థుల‌కు పోటీ లేకుండా ఉంది. ఇక నెల్లూరు జిల్లాలో మెట్ట ప్రాంతంలోనూ ఇదే ప‌రిస్థితి ఉంది. ప‌శ్చిమ ప్ర‌కాశం జిల్లాలో య‌ర్ర‌గొండ‌పాలెం, గిద్ద‌లూరు, మార్కాపురం, క‌నిగిరి నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ టీడీపీ జెండా ప‌ట్టేవాడే లేకుండా పోయాడు. ఇక క‌ర్నూలు జిల్లాలో ఏకంగా 14 జ‌డ్పీటీసీలు ఏక‌గ్రీవం అయ్యాయి. ఈ లెక్క‌న చూస్తే ఆరు జ‌డ్పీటీసీలు వైసీపీకి దాదాపు ఏక‌గ్రీవం అయిన‌ట్టే.

మరింత సమాచారం తెలుసుకోండి: