కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గత కొంత కాలంగా హైదరాబాద్ - విజయవాడ మధ్య బుల్లెట్ ట్రైన్ ను ప్రవేశపెట్టే అంశం గురించి కేంద్రంలోని ముఖ్య నేతలను కలిసి విజ్ఞప్తి చేస్తున్న విషయం తెలిసిందే. నిన్న లోక్ సభలో ఏపీ తెలంగాణ రాజధానుల మధ్య బుల్లెట్ రైలు నడిపితే రెండు రాష్ట్రాల ప్రజలకు ప్రయోజనకరంగా ఉండటంతో పాటు ప్రయాణ వేగం గంటన్నరకు తగ్గనుందని ఉత్తమ్ ప్రసంగించారు. 
 
కేంద్రానికి ఈ మార్గం లాభదాయకంగా ఉంటుందని... రోజూ లక్షల సంఖ్యలో ఈ మార్గం గుండా ప్రయాణిస్తారని తెలిపారు. దాదాపు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే బుల్లెట్ రైలు ప్రయాణికులకు ప్రయాణ వేగాన్ని భారీగా తగ్గించనుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఎక్కువగా ఉత్తర భారతదేశంలోనే బుల్లెట్ రైళ్లను ఏర్పాటు చేయడానికి మొగ్గు చూపుతోందని దక్షిణ భారతదేశానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 
 
చెన్నై - బెంగళూరు, హైదరాబాద్ - బెంగళూరు, హైదరాబాద్ - విజయవాడ మధ్య బుల్లెట్ రైళ్లు ఏర్పాటు చేయాలని దక్షిణ భారతదేశం నుండి కేంద్రానికి పలువురు నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. బుల్లెట్ రైళ్ల టికెట్ ధర ఇంచుమించు విమాన టికెట్ల స్థాయిలోనే ఉంటుంది. హైదరాబాద్ - విజయవాడ మార్గం నిజంగానే లాభదాయకంగా ఉంటుందా...? అనే ప్రశ్నకు కాదనే సమాధానం వినిపిస్తోంది. 
 
ఈ మార్గం కంటే హైదరాబాద్ - బెంగళూరు మధ్య బుల్లెట్ రైలు ఏర్పాటు చేస్తే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలు బుల్లెట్ రైలు రావాలని కోరుకుంటున్నప్పటికీ రైల్వే శాఖ అన్ని అంశాలను పరిశీలించి బుల్లెట్ రైలు మార్గాల విషయంలో తుది నిర్ణయం తీసుకోనుంది. హైదరాబాద్ నుండి విజయవాడ లేదా బెంగళూరు మార్గంలో బుల్లెట్ రైలు ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. రైల్వే శాఖ ఏ మార్గానికి ఆమోదం తెలుపుతుందో తెలియాలంటే మాత్రం కొంతకాలం ఆగాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: