తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్‌...రాష్ట్రంలో బ‌ల‌ప‌డాల‌ని భావిస్తున్న బీజేపీ మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అవ‌కాశం దొరికిన ప్ర‌తిసారి ఈ రెండు పార్టీలు విమ‌ర్శ‌లు చేసుకుంటున్నాయి. అయితే, బీజేపీ నేత‌లు జీర్ణించుకోలేని ప‌రిణామం ఇది. కేంద్రమంత్రి ప‌బ్లిక్‌గానే టీఆర్ఎస్ పార్టీ యువ‌నేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడైన‌ మంత్రి కేటీఆర్‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. 

 

ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్ షో అయిన‌ వింగ్స్ ఇండియా- 2020 ప్రదర్శనను హైదరాబాద్ వేదికగా నిర్వహిస్తున్న సంగ‌తి తెలిసిందే. కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి ఈ ప్రదర్శన మూడో రోజు కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ సైతం ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. కేటీఆర్ యంగ్ అండ్ డైనమిక్ మినిస్టర్ అని పేర్కొన్న కేంద్ర‌మంత్రి యువ భారత్‌కు కేటీఆర్ ఒక ప్రతీక అని ప్ర‌శంసించారు. కరోనా  క‌ల‌కలం ఉన్న‌ప్ప‌టికీ, వింగ్స్ సదస్సును విజయవంతం చేయడంలో కేటీఆర్ కీలక పాత్ర పోషించారని ఆయ‌న ప్ర‌శంసించారు.

 

అనంత‌రం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, వింగ్స్ ఇండియా కార్యక్రమాన్ని సుసాధ్యం చేసిన అధికారులను అభినందించారు. ఏవియేషన్ రంగం 14 శాతం వృద్దితో ఎదుగుతోందని అందుకే,  ఏవియేషన్ రంగంపై భారం త‌గ్గించడంలో భాగంగా జీఎస్టీని తగ్గించేందుకు కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఏరోస్పేస్, ఏవియేషన్ రంగంలో పెట్టుబడులకు తెలంగాణలో అపార అవకాశాలున్నాయని తెలిపారు. రీజనల్ కనెక్టివిటీని పెంచే ఉద్దేశంతో తెలంగాణలోని పాత ఎయిర్ పోర్టులను పునరుద్దరిస్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. రీజనల్ ఎయిర్ పోర్టులతో పాటు.. హెలిపోర్ట్, సీ ప్లేన్ లపై తెలంగాణ ఆసక్తిగా ఉందని  మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో మూడు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులను ఏర్పాటు చేయాలని కేంద్రానికి ప్రతిపాదించామన్నారు. వరంగల్ ఎయిర్ పోర్టును కూడా త్వరలో అందుబాటులోకి తెస్తామని మంత్రి కేటీఆర్ వెల్ల‌డించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: