ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి కొనసాగుతోంది. పురపాలికలకు నామినేషన్ల ఘట్టం పూర్తయింది. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ అరాచకం చేస్తోందంటూ చంద్రబాబు రోజూ ప్రెస్ మీట్లు పెట్టి ఊదరగొడుతున్నారు. ఒక్కసారి రెండు సార్లు కాదు.. పదే పదే ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ప్రతి సారీ అదే వాదన.. వైసీపీ రౌడీయిజం చేస్తోంది. పోలీసులు వాళ్లుతో కుమ్మక్కయ్యారు అనే.

 

 

అయితే ఈ వాదనను వైసీపీ తిప్పికొడుతోంది. పచ్చ నేతలకు లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి బొత్స ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రశాంతంగానే ఉన్నాయన్నారు మంత్రి బొత్స. చంద్రబాబు గంటగంటకీ మీడియాలో మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా జరగటం లేదని, దౌర్జన్యాలు జరుగుతున్నాయని ఆరోపణలు చేస్తున్నారని మంత్రి బొత్స అన్నారు.

 

 

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పటితో పోలిస్తే నూటికి 99 శాతం బ్రహ్మాండంగా ఎన్నికల ప్రక్రియ జరుగుతోందన్నారు మంత్రి బొత్స. ప్రభుత్వం తీసుకున్న చర్యలు, సీఎం వైయస్‌ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాల వల్ల ఎన్నికల ప్రక్రియ స్వేచ్ఛగా, ప్రజాస్వామ్య బద్ధంగా జరుగుతోందన్నారాయన. రాష్ట్రంలో 9676 ఎంపీటీసీ స్థానాలకు సుమారు 50 వేల మంది నామినేషన్లు వేశారు. 652 జడ్పీటీసీ స్థానాలు ఉంటే సుమారు 1500 మంది నామినేషన్లు వేశారు. ఎన్నికలపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు.. చిన్న చిన్న ఘటనలను కూడా చూపి చంద్రబాబు లబ్ధి పొందాలని అనుకుంటున్నారని విమర్శించారు.

 

 

అదే సమయంలో చంద్రబాబు ఎంత రెచ్చగొట్టినా సంయమనం పాటించాలని వైసీపీ నిర్ణయించిందట. రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలని చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని.. చంద్రబాబుకు విలువలు, సిద్ధాంతాలు లేవని మంత్రి బొత్స విమర్శించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: