కడప జిల్లాలో అనుకున్నదే అయింది . స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షాలకు పోటీ చేసేందుకు కనీసం అభ్యర్థులు లభించని పరిస్థితి నెలకొంది . దీనితో  కడప జిల్లా జెడ్పి పీఠాన్ని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ,  పోలింగ్ కు ముందే కైవసం చేసుకుంది . ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప లో ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు ఆ పార్టీ కి బాగానే కలిసి వచ్చినట్లు కన్పిస్తున్నాయి .  జమ్మలమడుగు టీడీపీ ఇంచార్జ్ రామసుబ్బారెడ్డిపార్టీ కి గుడ్ బై చెప్పి , వైస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరగా , పులివెందుల ఇంచార్జ్ సతీష్ రెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెల్సిందే .

 

అయితే  జిల్లాలో  పోలింగ్ కు ముందే మెజార్టీ స్థానాలు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో చేరడంతో , జెడ్పి పీఠం ఆ పార్టీ వశమైంది . కడప జిల్లాలో మొత్తం 50 జెడ్పిటిసి స్థానాలున్నాయి . ఏ పార్టీ అయిన జెడ్పి చైర్మన్ స్థానాన్ని దక్కించుకోవాలంటే 26 జెడ్పిటిసి స్థానాలను గెల్చుకోవాల్సిందే . అయితే ఎన్నికల కు ముందే వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా 35 జెడ్పిటిసి స్థానాలను గెల్చుకుని , సాధారణ మెజార్టీ ని అధిగమించింది .

 

35 జెడ్పిటిసి స్థానాల్లో కేవలం ఒకే ఒక నామినేషన్ దాఖలు కాగా , ఈ స్థానాల్లో ప్రతిపక్ష పార్టీల  తరుపున పోటీ చేసేందుకు ఎవరు సాహసించలేకపోయారు . దీనితో ఎన్నికల పోలింగ్ కు ముందే కడప జిల్లా జెడ్పి పీఠం ఫలితం తేలిపోయింది . ఇక మిగిలిన 15 స్థానాల్లో ఎన్నికలు జరిగిన మెజార్టీ స్థానాలను వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయంగా కన్పిస్తోంది . ఈ స్థానాల్లో ప్రతిపక్షాలు, అధికారపార్టీ అభ్యర్థులకు  ఎంతవరకు పోటీనిస్తాయన్నది చర్చనీయాంశంగా మారింది .  

మరింత సమాచారం తెలుసుకోండి: