మారుతీరావు కూతురు అమృత ఎట్టకేలకు నిన్న తన తల్లిని కలిసింది. మారుతీరావు మరణించిన వారం రోజుల తరువాత తన బిడ్డతో కలిసి పుట్టింటికి వెళ్లి తల్లిని పరామర్శించింది. తల్లి గిరిజతో చాలాసేపు మాట్లాడి ఆమె యోగక్షేమాలను అడిగి తెలుసుకుంది. పోలీసుల బందోబస్త్ మధ్య అమృత తల్లిని కలవగా అక్కడ ఉద్వేగపూర్వక వాతావరణం నెలకొంది. ముందుగానే అమృత వస్తున్నట్లు సమాచారం అందటంతో బంధువులు కూడా అక్కడికి చేరుకున్నారు. 
 
అమృతను చూడగానే ఆమె తల్లి తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఆమె తన బాబాయ్ శ్రవణ్ ను కూడా కలిసి మాట్లాడింది. తన తల్లితో ఏకాంతంగా మాట్లాడాలని పోలీసులకు చెప్పగా పోలీసులు శ్రవణ్ ను, బంధువులను పై అంతస్తులోకి పంపించారు. దాదాపు అరగంట పాటు అమృత తన తల్లితో ఏకాంతంగా మాట్లాడింది. తల్లి బాధలో ఉందని ఓదార్చేందుకు అమృత అక్కడికి వెళ్లినట్టుగా తెలుస్తోంది. 
 
అమృత తండ్రి మారుతీరావు ఈ నెల 8న హైదరాబాద్ లోని ఆర్యవైశ్యభవన్ లో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోస్టుమార్టం రిపోర్టులో విషం తాగడంతో శరీరంలో రక్తప్రసరణ ఆగిపోయి గుండెపోటు వచ్చిందని తేలింది. ఆయన తన సూసైడ్ నోట్ లో గిరిజ క్షమించు... అమృత తల్లి దగ్గరకు పో అని రాసి ఉంది. మారుతీరావు సూసైడ్ నోట్ ద్వారా ఆయన మరణానికి ముందు తీవ్ర మనోవేదనకు గురయ్యారని అర్థమవుతోంది. 
 
మారుతీరావు అంత్యక్రియల సందర్భంగా కడసారి చూసేందుకు అమృత వెళ్లగా స్థానికులు, కుటుంబ సభ్యులు అమృత గో బ్యాక్ అంటూ నినాదాలు చేసి ఆమె చివరిచూపు చూడకుండానే వెనుదిరిగి వెళ్లిపోయేలా చేశారు. గతంలోనే అమృత ప్రణయ్ తల్లిదండ్రులను వదిలిపెట్టి రాలేనని స్పష్టం చేసింది. అమృత ఇప్పుడు కూడా తల్లి తన దగ్గరకు వస్తే అభ్యంతరం లేదని తాను మాత్రం తల్లి దగ్గర ఉండలేనని చెప్పినట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: