తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు క‌రోనా వైర‌స్ విష‌యంలో ప్ర‌భుత్వ ప‌రంగా కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న సంగ‌తి తెలిసిందే. శనివారం సాయంత్రం రాష్ట్ర మంత్రిమండలి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలుతీసుకోవాల్సిన అవసరం ఉన్నదని.. ఇందుకోసం రెండుదశల కార్యక్రమాలను చేపట్టాలని క్యాబినెట్‌ నిర్ణయించిందని వెల్లడించారు. 15 రోజులు.. ఏడు రోజులవారీగా కార్యక్రమాలు నిర్ణయించామని తెలిపారు. ఇందులోభాగంగా మార్చి 31 వరకు అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. సినిమాహాళ్లు, బార్లు, పబ్‌లు, మెంబర్‌షిప్‌ క్లబ్‌లు మూసివేస్తున్నట్లు చెప్పారు. బహిరంగసభలు, సమావేశాలు, సదస్సులు, వర్క్‌షాప్‌లు, ఉత్సవాలు, ర్యాలీలు, ఎగ్జిబిషన్లు, ట్రేడ్‌ ఫెయిర్లు, సాంస్కృతిక కార్యక్రమాలకు అనుమతులివ్వబోమని పేర్కొన్నారు. నిత్యావసర వస్తువులకు ఇబ్బంది కలుగకుండా మాల్స్‌, సూపర్‌మార్కెట్లను మూసివేయడంలేదన్నారు. విద్యాసంస్థలు మూసివేసినప్పటికీ బోర్డు పరీక్షలు యథాతథంగా జరుగుతాయని, సంక్షేమహాస్టళ్లలో వసతి సౌకర్యం కొనసాగుతుందని పేర్కొన్నారు. 

 


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలందరిలో ధైర్యాన్ని, నమ్మకాన్ని పెంచే విధంగా చర్యలు తీస్కుంటున్నందుకు ధ‌న్యావాదాలు అని మాజీ కేంద్రమంత్రి, మెగాస్టార్ చిరంజీవి అన్నారు.``కరోనా వైరస్‌ వ్యాపించకుండా  ఏపీ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటోంది. దీనిపై మరింత అప్రమత్తత అవసరం కరోనా మహమ్మారి నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తోన్న ద్విముఖ వ్యూహం బాగుంది` అని తెలిపారు. కరోనా సోకిన వారికి తగిన చికిత్స అందించడం, వైరస్ వ్యాప్తి కాకుండా జనాలు గుమికూడకుండా క్రీడల్ని వాయిదా వేయడం, మాల్స్, సినిమా హాల్స్ ని మూసివేయడం, స్కూల్స్, కళాశాలలకు సెలవులు ప్రకటించడం తదితర చర్యలు తీసుకోవడం ప్రజల ఆరోగ్య పరంగా మంచిదేనని అన్నారు.   కరోనా నియంత్రణ బాధ్యత ప్రభుత్వాలకే వదిలివేయకుండా ప్రజలు అందరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. తన సినిమా షూటింగ్‌లను తక్షణం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

 

ఇదిలాఉండ‌గా, క‌రోనాపై సోషల్ మీడియాలో ప్ర‌క‌ట‌న‌లు, ప్ర‌చారం విష‌యంలో సీఎం కేసీఆర్ ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. `కొందరు అతిగాళ్లు ఇష్టారీతిన ప్రచారం చేస్తున్నారు. అలాంటి వారిపై కఠినచర్యలు తీసుకుంటాం` సీఎం హెచ్చరించారు. `` ఇలాంటి సమయంలో ప్రజల్లో భయోత్పాతం సృష్టించడం మంచిది కాదు. అలా ప్ర‌చారం చేసే వారిని ఎవరూ ఏమీ చేయలేరనుకుంటున్నారు. కానీ ఈసారి ప్రభుత్వం అంటే ఏమిటో రుచి చూస్తారు.`` అని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: