ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ఇప్పుడు భారత్ లో విస్తరిస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్రం అన్ని రాష్ట్రాలను ఇప్పటికే హెచ్చరించింది.  ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న అత్యవసర కేబినేట్ మీటింగ్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇందులో కరోనాకు సంబంధించిన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  కరోనా మనదేశంలో పుట్టిన వ్యాధి కాదని, చైనాలో జన్మించి అక్కడి నుంచి ఇతర దేశాలకు పాకుతోందని అన్నారు. కేంద్రం నుంచి తమకు అందిన సమాచారం ప్రకారం, దేశంలో 83 మందికి కరోనా సోకిందని, వారిలో 66 మంది భారతీయులు కాగా, మిగతావాళ్లు విదేశీయులని వివరించారు. ఈ 66 మంది భారతీయులు కూడా విదేశాల నుంచి ఇక్కడికి వచ్చినవాళ్లేనని తెలిపారు.

 

తెలంగాణలోని పల్లె ప్రాంతాలకు కరోనా వైరస్ సోకే అవకాశాలు లేవని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు.  ఈ మద్య కావాలని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు లేని పోని ఫేక్ న్యూస్ లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని వాటి వల్ల జనాలనుు భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆగ్రహించారు.  అలాంటి సైబర్ నేరగాళ్ల భరతం పట్టేందుకు తెలంగాణ పోలీసు సిద్దంగా ఉన్నారని అన్నారు.  ఈ వ్యాధి ఇండియాలోనో, తెలంగాణలోనో పుట్టినది కాదని కేసీఆర్ అన్నారు. విదేశాల నుంచి వస్తున్న వ్యాధి కాబట్టి దేశీయంగా ప్రమాదం లేదని భరోసా ఇచ్చారు.

 

హైదరాబాద్‌ లోనే ఎయిర్ పోర్టు ఉన్నందున కరోనా వైరస్‌ ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు మాత్రమే పరిమితమవుతుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాలకు సోకే అవకాశమే లేదని, ఈ విషయంలో తనది భరోసా అని అన్నారు. అయితే  130 కోట్ల మంది జనాభా ఉన్న భారత్ లో ఇది 83 మందికే సోకిందని, అందునా మరణాల సంఖ్య రెండేనని, దీనిపై ఎవరూ ఆందోళన చెందనవసరం లేదని స్పష్టం చేశారు.ముందు జాగ్రత్తగా ఈ నెల 31 వరకు విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు, సమ్మర్ క్యాంపులు మూసివేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. తమ ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: