మ‌రో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం మ‌నుగ‌డ‌పై అనుమాన మేఘాలు క‌నిపిస్తున్నాయి. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని కాంగ్రెస్‌ స‌ర్కారుపై నీలినీడ‌లు క‌మ్ముకున్నాయి. ఇటీవల కాంగ్రెస్‌ సీనియర్ నేత‌ జ్యోతిరాదిత్య సింధియా భారతీయ జనతా పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు ఆరుగురు మంత్రులు సహా 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, బీజేపీలో చేరారు. దీంతో కమల్‌నాథ్‌ ప్రభుత్వం మైనార్టీలో పడింది.  కమల్‌నాథ్‌ కేబినెట్‌లో మంత్రులుగా ఉండి ఉద్వాసనకు గురైన ఆరుగురు ఎమ్మెల్యేల రాజీనామాలకు స్పీకర్‌ ఎన్‌పీ ప్రజాపతి ఆమోదం తెలిపారు. దీంతో ఇప్పుడు ఏం జ‌ర‌గ‌నుంద‌నే ఉత్కంఠ స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతోంది.

 

 

కాగా, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 22 మంది అసమ్మతి ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం, దీంతో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో శుక్రవారం మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్ గవర్నర్‌ లాల్జీటాండన్‌ను కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు మూడు పేజీల వినతిపత్రాన్ని సమర్పించారు.  అసెంబ్లీలో విశ్వాస పరీక్షకు సిద్ధమేనని చెప్పారు. సుమారు అరగంట పాటు గవర్నర్‌తో భేటీ అయిన ఆయన రాజకీయ సంక్షోభం తలెత్తడానికి గల కారణాలు, ఇందులో బీజేపీ పాత్ర గురించి గవర్నర్‌కు వివరించారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులకు మూల కారణం బీజేపీనేనని, ఆ పార్టీ తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నదని వినతి పత్రంలో పేర్కొ న్నారు.  గవర్నర్‌తో సమావేశం అనంతరం కమల్‌నాథ్‌ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ కనుసన్నల్లోనే ఎమ్మెల్యేల రాజీనామా ప్రక్రియ జరిగిందని,  విశ్వాస పరీక్షకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని పేర్కొన్నారు. మరోవైపు కమల్‌నాథ్‌ సూచనమేరకు  కాంగ్రెస్‌ మాజీ నేత జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి చెందిన ఆరుగురు మంత్రులను పదవుల నుంచి గవర్నర్‌ తొలగించారు.

 


కాగా, కాంగ్రెస్‌కు షాకిస్తూ, జ్యోతిరాధిత్య వెంట న‌డిచిన ఆరుగురు మంత్రుల‌ను మంత్రివర్గం నుంచి తొలగించడంతో...ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిపోయారు. ఎమ్మెల్యేలు ఇమ్రతీదేవీ, తులసీలావట్‌, పి.సింగ్‌థోమర్‌, మహేంద్రసింగ్‌, గోవింద్‌సింగ్‌, పి.రామ్‌చౌదరీలు తమ పదవులకు రాజీనామా చేయ‌గా వారి రాజీనామాలు ఆమోదం పొందాయి. మ‌రోవైపు సీఎం గ‌వ‌ర్న‌ర్‌ను క‌ల‌వ‌డంతో బీజేపీ మధ్యప్రదేశ్‌ రాష్ట్ర నాయకులు సైతం గవర్నర్‌ లాల్జీ టాండన్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారు అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్‌కు వినతిపత్రం అందించారు. అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలనీ.. అదే సమయంలో వీడియో కూడా తీయాలని వారు గవర్నర్‌ను కోరారు. మారుతున్న ప‌రిణామాల నేప‌థ్యంలో...కాంగ్రెస్ స‌ర్కారు మ‌నుగ‌డ క‌ష్ట‌మ‌నే అంచ‌నాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: