జనసేన అధినేత ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు చేసిన ప్రకటనపై స్పందించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి అనుకూలంగా పని చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ భయానక వాతావరణంలో జరిగిందని చెప్పారు. వైసీపీ నేతలు భయపెట్టి నామినేషన్లను ఉపసంహరించుకునేలా చేశారని పవన్ వ్యాఖ్యలు చేశారు. 
 
కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాల గురించి లేఖ రాస్తానని చెప్పారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు వైసీపీ నేతల దాడులకు సంబంధించిన వీడియోలను అందజేస్తామని తెలిపారు. రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని అన్నారు. జనసేన మహిళా నేతలపై దాడులు జరిగినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఎన్నికల అధికారుల గురించి ఫిర్యాదు చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
స్వయంగా వెళ్లి కేంద్ర పెద్దలను కలిసి నామినేషన్ల సమయంలో రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాల గురించి చెబుతానని అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వైసీపీ దౌర్జన్యానికి పాల్పడిందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియను మళ్లీ కొత్తగా చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో హింస, దౌర్జన్యాలపై తాము చెప్పిన మాటలే నిజమయ్యాయని అన్నారు. 
 
రాజమండ్రిలో ఎన్నికల ప్రక్రియ వాయిదా పడిన నేపథ్యంలో పవన్ మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రజాస్వామాన్ని ఖూనీ చేస్తుంటే తాము ఊరుకోమని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా రాష్ట్రంలో ఎన్నికలు జరగకపోతే కోర్టుకు వెళ్లాల్సి వస్తుందని అధికార పార్టీని హెచ్చరించారు. రాష్ట్రంలో జరిగిన దౌర్జన్యాలు, హింసపై నివేదికలు తయారు చేస్తున్నామని వాటిని ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేస్తామని తెలిపారు. తప్పులు చేసిన అధికారులపై కేంద్రానికి నివేదిక పంపిస్తామని చెప్పారు.                                       

మరింత సమాచారం తెలుసుకోండి: