తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డిపై గత కొన్ని రోజుల నుండి భూ దందాకు సంబంధించిన ఆరోపణలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. భూ దందాలలో రేవంత్ తో పాటు ఆయన సోదరులకు కూడా ప్రమేయం ఉన్నట్లు సమాచారం. ఆయన సోదరులు అక్రమాలకు పాల్పడ్డారనే వార్తలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. సొంత పార్టీ నేతలే రేవంత్ భూదందా ఆరోపణలపై విమర్శలు వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం. 
 
రంగారెడ్డి జిల్లా భూపాల్ పల్లిలో, హైదరాబాద్ శివార్లలో రేవంత్ భూ దందాలకు, భూ కబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై రెవిన్యూ అధికారులు విచారణ జరిపి ఆరోపణలు నిజమేనని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు అధికారులు ఇప్పటికే ఆరోపణలకు సంబంధించిన నివేదికను అందజేశారు. రేవంత్ భూదందాలకు, అక్రమాలకు పాల్పడ్డాడని ఆయన మాజీ అనుచరుడు, మాజీ జడ్పీటీసీ బాల్ సింగ్ నాయక్ ఆరోపణలు చేశారు. 
 
కొడంగల్ ఎఫ్.డీ.ఎల్ చెరువు భూములను రేవంత్ ఆక్రమించాడని... భూ దందాలకు సంబంధించిన ఆధారాలు అన్నీ తన దగ్గర ఉన్నాయని అన్నారు. దాదాపు 12 సంవత్సరాలు రేవంత్ తో తనకు పరిచయం ఉందని ఆయన నిజ స్వరూపం తెలిసిన తరువాత మాత్రమే తాను పార్టీ మారానని చెప్పుకొచ్చారు. రేవంత్ తన స్వప్రయోజనాల గురించి మాత్రమే ముఖ్యమంత్రులను, మంత్రులను కలిసేవాడని అన్నారు. 
 
రేవంత్ 100 శాతం బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేశాడని చెప్పారు. ఆయన కొడంగల్ లో ఎఫ్.ఢీ.ఎల్ కింద రెండెకరాల ల్యాండ్ కబ్జా చేసి దర్జాగా ఇళ్లు కట్టుకున్నాడని అన్నారు. రేవంత్ తో పాటు ఆయన అన్న, తమ్ముడు కొడంగల్ లో, కోజిగిలో, హైదరాబాద్ శివార్లలో భూ కబ్జాలకు పాల్పడ్డారని చెప్పారు. చట్టం నుండి ఎవరూ తప్పించుకోలేరని... బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసేవాళ్లకు ఏదో ఒకరోజు పాపం పండుతుందని తెలిపారు. ఖరీదైన భూములపై రేవంత్ ప్రధానంగా దృష్టి పెట్టి భూదందాలకు పాల్పడ్డారని ఆరోపణలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: