ఏపీ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్‌పై ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్రెస్‌మీట్లో తీవ్ర‌స్థాయిలో విరుచుకు ప‌డ్డారు. ఆదివారం ర‌మేష్ ఎన్నిక‌లు వాయిదా వేసిన‌ట్టు ప్ర‌క‌ట‌న చేశారు. అనంత‌రం గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన జ‌గ‌న్ ప్రెస్‌మీట్ పెట్టి ర‌మేష్ కుమార్‌ను ఏకేశారు. చంద్ర‌బాబు సీఎంగా ఉండ‌గా ఆయ‌న సామాజిక‌వర్గానికే చెందిన ర‌మేష్‌ను ఎన్నిక‌ల అధికారిగా పెట్టుకున్నార‌న్నారు. ఇక ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌కు ఉండాల్సిన ప్రాథ‌మిక ల‌క్ష‌ణం నిష్ప‌క్ష‌పాతం అని.. అయితే నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ విచ‌క్ష‌ణ కూడా కోల్పోయిన‌ట్టు ఆయ‌న మాట‌ల‌ను బ‌ట్టే అర్థ‌మ‌వుతోంద‌ని జ‌గ‌న్ విమ‌ర్శించారు. ఏ అధికారి అయినా కులాలు, మ‌తాలు.. పార్టీల‌కు అతీతంగా ప‌ని చేయాలి... అప్పుడే ఆ అధికారికి గౌర‌వం ఉంటుంది. కానీ ర‌మేష్ కుమార్ అవ‌న్నీ మ‌ర్చిపోయార‌న్నారు.



ఒక వైపు క‌రోనా వైర‌స్ సాకుతో ఎన్నిక‌ల‌ను పోస్ట్ పోన్ చేస్తున్నాన‌ని చెప్పిన ర‌మేష్ అదే ప్రెస్ మీట్లో గుంటూరు, చిత్తూరు జిల్లాల క‌లెక్ట‌ర్లు, ఎస్సీల‌తో పాటు మాచ‌ర్ల సీఐల‌ను స‌స్పెండ్ చేస్తూ ఉత్త‌ర్వులు ఇచ్చార‌ని జ‌గ‌న్ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఒక వైపు ఎన్నిక‌లు పోస్ట్ పోన్ చేస్తూ... అదే ప్రెస్‌మీట్లో అధికారుల‌ను త‌ప్పిస్తున్నాన‌న‌డం స‌రికాద‌న్నారు. ప్ర‌జ‌లు ఓట్లేసి 151 స్థానాల‌తో గెలిపించి న‌న్ను సీఎం చేశారు... ఈ అధికారం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిదా ?  ఈ ర‌మేష్ కుమార్ దా ?  ర‌మేష్ కుమార్ మాట మాట్లాడితే విచ‌క్ష‌ణ అధికారం అన్న ప‌దం వాడుతున్నారు ?  నీ ఇష్టం వ‌చ్చిన‌ట్టు సీఎం అధికారాలు ఎలా తీసుకుంటావు ?  ఇలా అయితే ప్ర‌జాస్వామ్యంలో ఇక ఎమ్మెల్యేలు ఎందుకు ?  సీఎంగా నేను ఎందుకు ? అని తీవ్ర స్థాయిలో ప్ర‌శ్నించారు.



ఇక శ‌నివారం సాయంత్రం క‌లెక్ట‌ర్ల‌కు ఇళ్ల ప‌ట్టాలు ఇవ్వ‌వ‌ద్ద‌ని ఈసీ నుంచి ఆదేశాలు వ‌చ్చాయ‌ని... ఇది ఎంత వ‌ర‌కు స‌మంజ‌సం అని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. శ‌నివారం సాయ‌త్రం ఇళ్ల ప‌ట్టాలు ఇవ్వ‌వ‌ద్ద‌ని లెట‌ర్లు ఇచ్చిన వ్య‌క్తి ఆదివారం ఉద‌యం ఎన్నిక‌లు ఎలా వాయిదా వేశార‌న్నారు. ఇక స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్ప‌టికే 2000 వేలకు పైగా ఎంపీటీసీలు ఏక‌గ్రీవం అయ్యాయని.. ఇప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే చంద్ర‌బాబు పార్టీ ప‌రువు మ‌రింత పోతుంద‌ని జీర్ణించుకోలేకే ఎన్నిక‌లు వాయిదా వేశార‌ని జ‌గ‌న్ విమ‌ర్శించారు. ఇక ఎన్నిక‌ల వాయిదా ఆర్డ‌ర్ త‌యార‌వుతున్న‌ట్టు సీఎస్‌, హెల్త్ సెక్ర‌ట‌రీకి కూడా తెలియ‌ద‌ని.. ఆర్డ‌ర్ ఎవ‌డో త‌యారు చేస్తున్నాడు ?  ఎవ‌డో ?  చెపుతున్నాడంటూ కూడా జ‌గ‌న్ విమ‌ర్శించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: