ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సార్వ‌త్రిక ఎన్నిక‌ల నామినేష‌న్ల ప్ర‌క్రియ ముగిసే టైంకే అధికార వైసీపీ తిరుగులేని ఫ‌లితాల్లో దూసుకుపోతోంది. ఇప్ప‌టికే మొత్తం 9 వేల ఎంపీటీసీల‌కు గాను ఏకంగా 2 వేల‌కు పైగా ఎంపీటీసీలు ఏక‌గ్రీవం అయ్యాయి. ఇక జ‌డ్పీటీసీల్లో కూడా ఆరేడు జిల్లాల్లో ఇప్ప‌టికే జ‌డ్పీ చైర్మ‌న్ ప‌ద‌వులు వైసీపీ ఖాతాలో ప‌డ్డాయి. మాచ‌ర్ల‌, జ‌మ్మ‌ల‌మ‌డుగు, పులివెందుల‌తో పాటు క‌డ‌ప‌, చిత్తూరు, తిరుప‌తి లాంటి కార్పొరేష‌న్లు కూడా వైసీపీ ఖాతాలో చేరిపోయాయి. ఇటు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వ‌ర‌కు.. అటు క‌ర్నూలు నుంచి అనంత‌పురం వ‌ర‌కు ఏ జిల్లాలో... ఏ నియోజ‌క‌వ‌ర్గంలో చూసినా వైసీపీ జెండాయే ఎగురుతోంది.



ఈ టైంలో రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన‌ అధికారి నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ ఆదివారం ఉద‌యం ఎన్నిక‌ల‌ను వాయిదా వేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించి అంద‌రికి షాక్ ఇచ్చారు. దీనిపై జ‌గ‌న్ కౌంట‌ర్ ఇస్తూ ఓ వైపు క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో ఎన్నిక‌ల‌ను వాయిదా వేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించి.. మ‌రో వైపు జిల్లా క‌లెక్ట‌ర్లు, ఎస్పీల‌ను స‌స్పెండ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌ట‌న చేయ‌డం చాలా ఆశ్చ‌ర్యం వేసింద‌ని.. ఎవ‌రైనా అలా చేస్తారా ? అని జ‌గ‌న్ ఫైర్ అయ్యారు. క‌రోనా వైర‌స్ సాకుతో ఎన్నిక‌ల‌ను పోస్ట్ పోన్ చేయ‌డంతో పాటు అధికారుల‌ను బ‌దిలీ చేసే అధికారం నీకు ఎక్క‌డ‌ద‌ని ర‌మేష్‌ను జ‌గ‌న్ నేరుగానే ప్ర‌శ్నించారు.



ఇదే టైంలో చంద్ర‌బాబుకు, ర‌మేష్ కుమార్‌కు మ‌ధ్య ఉన్న బంధాన్ని కూడా చెప్పారు. ర‌మేష్ కుమార్‌ది.. చంద్ర‌బాబుది ఒకే సామాజిక వ‌ర్గం అని... ఆయ‌న సీఎంగా ఉన్న‌ప్పుడు ఆయ‌న‌కు న‌చ్చిన ఈ ర‌మేష్ కుమార్‌ని ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన అధికారిగా తెచ్చుకున్నారని చెప్పారు. ఇప్పుడు స్థానిక ఎన్నిక‌ల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చూసి త‌ట్టుకోలేకే... చంద్ర‌బాబు కోస‌మే ఆయ‌న ఎన్నిక‌ల‌ను వాయిదా వేశార‌ని ఫైర్ అయ్యారు. ఇక ఎంతో మంది పేద‌ల‌కు ఇచ్చే ఇళ్ల స్థ‌లాల‌ను కూడా ఇవ్వ‌వ‌ద్ద‌ని ఈసీ చెప్ప‌డాన్ని సైతం జ‌గ‌న్ త‌ప్పుప‌ట్టారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: