ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా ఒక్కో రాష్ట్రంలో డీలా ప‌డుతూ వ‌స్తోన్న కాంగ్రెస్ పార్టీ త‌మ చేతిలో ఉన్న ఒక్కో రాష్ట్రాన్ని కూడా బీజేపీకి కోల్పోతూ వ‌స్తోంది. ప్ర‌జ‌లు సైతం బీజేపీ మీద వ్య‌తిరేక‌త‌తో కాంగ్రెస్‌ను గెలిపిస్తున్నా వాళ్లు మాత్రం అధికారం నిలుపుకునే ప‌రిస్థితుల్లో లేర‌ని ఆ పార్టీలో జ‌రుగుతోన్న ప‌రిణామాలే చెపుతున్నాయి. ఇక ఇప్ప‌టికే క‌ర్నాట‌క‌లో బీజేపీ - జేడీఎస్ క‌లిసి పొత్తు పెట్టుకుని గ‌ట్టిగా యేడాది కూడా పాల‌న చేయ‌కుండానే ఆ ప్ర‌భుత్వం ప‌డిపోయింది. క‌ర్నాట‌క షాక్‌లో ఉన్న కాంగ్రెస్‌కు ఇప్పుడు మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా అదిరిపోయే షాక్ ఇచ్చారు.



ఈ సంక్షోభం నేప‌థ్యంలో క‌మ‌ల్ నాథ్ స‌ర్కార్ నుంచి ఆరుగురు మంత్రుల‌తో పాటు కొంద‌రు ఎమ్మెల్యేలు బీజీపీలోకి జంప్ చేసేందుకు రెడీ అవుతున్నారు. క‌మ‌ల్ నాథ్ స‌ర్కార్ రేప‌టి బ‌ల‌ప‌రీక్ష‌లో నెగ్గుతుందా ?  లేదా ? అన్న సందేహాలు ఉండ‌నే ఉన్నాయి. ఎమ్మెల్యేల రాజీనామాతో మధ్య ప్రదేశ్‌‌లో నెలకొన్న సంక్షోభం నుంచి గట్టెక్కకుండానే కాంగ్రెస్ పార్టీకి మరో రాష్ట్రంలో  ఊహించని షాక్ తగిలింది. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ సొంత రాష్ట్ర‌మైన గుజ‌రాత్ వంతు ఈ సారి వ‌చ్చేసింది.



ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా రాజ్య‌స‌భ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో గుజ‌రాత్‌, జార్ఖండ్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ లాంటి రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ కొన్ని సీట్లు గెలుచుకోనుంది. అయితే ఇప్పుడు గుజరాత్‌లో రాజ్యసభ ఎన్నికలకు సరిగ్గా కొద్దిరోజుల ముందు ఆ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధమైనట్టు సమాచారం. కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు సోమగంద, కేవీ కాకడీయ ఇప్పటికే రాజీనామా చేసేశారు. దీంతో ఈ లిస్టులో ఇంకెంత మంది ఉన్నారో ?  తెలియ‌క కాంగ్రెస్ అత‌లాకుత‌ల మ‌వుతోంది. తాము కోరుకున్న వ్య‌క్తిని కాకుండా మ‌రో వ్య‌క్తికి రాజ్య‌స‌భ సీటు ఇస్తుంద‌న్నందుకే ఈ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేసిన‌ట్టు స‌మాచారం. ఏదేమైనా ఈ సంక్షోభం ఎటు మ‌లుపులు తిరుగుతుందో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: