నిన్న‌గాక మొన్న‌నే క‌ర్నూలు జిల్లా నందికొట్కూరులో పార్టీ ప‌రిస్థితిపై పెద్ద ఎత్తున స‌మీక్ష చేసిన వైసీపీ అధినేత జ‌గ‌న్ ఇక్క‌డి ప‌రిస్థితిని స‌రిదిద్దే ప్ర‌య‌త్నం చేశారు. ఎమ్మెల్యే ఆర్థ‌ర్ వ‌ర్సెస్ పార్టీ ఇంచార్జ్ బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి వ‌ర్గాల మ‌ధ్య నెల‌కొన్న అపోహ‌లు తొల‌గించే ప్ర‌య‌త్నం చేశారు. ఇద్ద‌రికీ స‌ర్ది చెప్పారు. అయి తే, ఇది మూణ్నాళ్ల ముచ్చ‌ట‌గానే మారిపోయింద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. బైరెడ్డి వ‌ర్గంఆధిప‌త్య ధోర‌ణికి ఎక్క‌డా అడ్డుక‌ట్ట ప‌డ‌క‌పోగా.. ప్ర‌స్తుత స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లోనూ పైచేయి సాధించాల‌నే ప్ర‌య‌త్నం చేస్తుండ‌డంతో ఎమ్మెల్యే ఆర్ధ‌ర్ ఉక్కిరిబిక్కిరికి గుర‌వుతున్నారు.



ఇటీవ‌ల నామినేటెడ్ ప‌ద‌వుల విష‌యంలో రాజుకున్న అగ్గి ఇరువురు నాయ‌కుల మ‌ధ్య మ‌రింత ర‌చ్చ‌కు దారితీస్తోంది. నామినేటెడ్ ప‌ద‌వుల విష‌యంలో తాను సిఫార‌సు చేసిన నాయ‌కుల‌కు అవ‌కాశం ఇస్తామ‌ని చెప్పిన సీఎం జ‌గ‌న్‌.. చివ‌రి నిముషంలో బైరెడ్డి వ‌ర్గానికి ప్రాధాన్యం ఇవ్వ‌డంతో ఆర్థ‌ర్ ర‌గిలిపోతున్నారు. ఈ విష‌యంలోనే పంచాయ‌తీ జ‌రిగింది. దీంతో కొంత మేర‌కు శాంతించిన‌ట్టు క‌నిపించినా. ఆర్ధ‌ర్ ప‌రిస్థితి ఇప్పుడు మ‌రింత తీవ్రంగా మారింది. ఆయ‌న‌కు సంబంధించిన వారికి స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఒక్క ఛాన్స్ కూడా రాకుండా బైరెడ్డి వ‌ర్గం అడ్డుపుల్ల వేసింది.



కనీసం భీ-ఫార్మ్ ఇచ్చే అధికారం కూడా ఎమ్మెల్యేకి లేదని బైరెడ్డి సిద్దార్థ రెడ్డి హుకం జారీ చేసారు. ఎమ్మె ల్యే పక్కనే ఉన్నా భీ-ఫార్మ్ లు మాత్రం  బైరెడ్డి  చేతుల మీదుగా ఇచ్చి ఆర్ధర్ ని ఘోరంగా అవమానిం చార‌నే వాద‌న వినిపిస్తోంది.  ఇంత కాలం నియోజికవర్గంలో పేరుకి మాత్రమే ఎమ్మెల్యే అభివృద్ధి, సంక్షే మ కార్యక్రమాలు చేప‌ట్టిన ఆర్ధ‌ర్ ఇప్పుడు నామ‌మాత్రంగా మారిపోయార‌ట‌.  కనీసం 10 శాతం సీట్లు కూడా తన వర్గానికి ఇప్పించుకోలేని నిస్సహాయ స్థితికి దిగజారిపోయారని అంటున్నారు.  ఈ క్ర‌మంలో ఆర్ధ‌ర్ తీవ్రంగా ఇబ్బంది ప‌డుతున్నార‌ట‌.



వీరిద్ద‌రు ఇంత‌కు ముందే జ‌గ‌న్ స‌యోధ్య‌తో వెళ్లాల‌ని చెప్పినా విన‌లేదు. త్వ‌ర‌లోనే మ‌రోసారి జ‌గ‌న్‌ను క‌లిసి.. త‌న గోడును వినిపించుకునేం దుకు ఆర్ధ‌ర్ రెడీ అవుతున్నార‌ట‌. ఇదిలావుంటే, ఇప్పుడు స్థానిక ఎన్నిక‌ల్లో త‌న ప‌ట్టు పెంచుకోక‌పోతే.. ఎలా అనే ప్ర‌శ్న కూడా ఆయ‌న‌ను వేధిస్తోంది. ఈ క్ర‌మంలో ఏం చేయాలో తెలియ‌క ఎమ్మెల్యే స‌త‌మ‌త‌మ‌వుతున్నార‌ట‌. మ‌రి జగ‌న్ ఏం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: