ఎన్నికల వాయిదా అన్నది అందరినీ షాక్ కి గురి చేసింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ అయితే తన బాధను తట్టుకోలేకపోయారు. చంద్రబాబు మనిషిగా ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ పని చేశారంటూ డైరెక్ట్ గానే నిందించారు. ఆయన మీద గవర్నర్ కి ఫిర్యాదు కూడా చేశారు.

 

ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ స్థానిక ఎన్నికలను ఏకంగా ఆరు వారాలకు వాయిదా వేయడం అతి పెద్ద ఆశ్చర్యం. ఎందుకంటే తెలంగాణాలో కానీ దేశంలో మరెక్కడా కానీ ఈ నెలఖరు వరకే అన్నీ షట్ డౌన్ చేస్తున్నారు. అంటే పదిహేను రోజులు మాత్రమే నియంత్రణ కోసం గడువు ఇచ్చి చూస్తున్నారు. ఒక వేళ అప్పటికీ కాకపోతే తరువాత చూసుకోవచ్చునన్నది వారి ఆలోచన.

 

ఇక ఏపీ విషయం తీసుకుంటే కరోనా కేసులు  ఇప్పటికైతే  ఏవీ లేవు. ఇప్పటివరకూ ఏపీ ప్రశాంతంగా ఉంది. మరో వారం పది రోజులు కళ్ళు మూసుకుంటే ఎన్నికలు కూడా సజావుగా  పూర్తి అయిపోతాయి. కానీ ఈసీ తీసుకున్న నిర్ణయం వల్ల ఎన్నికలు ఇప్పట్లోనే కాదు ఎపుడు జరుగుతాయో కూడా తెలిసే అవకాశమే లేదు. ఎందుకంటే కరోనాకు నియంత్రణ తప్ప నివారణ లేదు కాబట్టి.

 

ఇక మే వరకూ ఎన్నికలు జరపకుండా ఆపితే ఆ తరువాత జరిపినా జగన్ అనుకున్నట్లుగా మూడు రాజధానుల విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకోలేడు. ఇక ఏపీలో చూస్తే ఇప్పటికే శాసన‌మండలిలో అధికార వికేంద్రీకరణ బిల్లు పెండిగులో ఉంది. రద్దు బిల్లు పార్లమెంట్ లో పెండింగులో ఉంది.

 

ఈ నేపధ్యంలో ఎన్నికలో మెజారిటీ మూడు ప్రాంతాలో వస్తే విశాఖకు రాజధాని షిఫ్ట్ చేయాలన్నది జగన్ ఆలోచనగా ఉంది. కానీ ఇపుడు ఆగిన ఎన్నికల కారణంగా మొత్తం జగన్ ఆలోచనలు దెబ్బతినేలా ఉన్నాయి. జూన్ నాటికి ఎన్నికలు జరిగినా అప్పటికి కొత్త విద్యా సంవత్స‌రం మొదలవుతుంది. దాంతో మరో ఏడాది వరకూ అమరావతిని జగన్ షిఫ్ట్ చేయలేరు. మొత్తానికి అక్కడికి లింక్ పెట్టి ఇపుడు ఎన్నికలను వాయిదా వేయించారన్న విమర్శలు వస్తున్నాయి. చూడాలి ఈ ప్రచారంలో నిజమెంతో.

మరింత సమాచారం తెలుసుకోండి: