స్ధానిక సంస్ధల ఎన్నికల సందర్భంగా రాజోలు ఎంఎల్ఏ రాపాక వరప్రసాద్ ను జనసేన అధినేత పవన్ కల్యాన్ పార్టీకి దూరంగా పెట్టేసినట్లే అర్ధమవుతోంది. పార్టీ తరపున మొన్నటి ఎన్నికల్లో గెలిచిన ఏకైక ఎంఎల్ఏ రాపాక మాత్రమే అన్న విషయం అందరికీ తెలిసిందే.  ఇంతకీ విషయం ఏమిటంటే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో  పోటి విషయంలో పార్టీ తరపున ఎంపిక చేసిన అభ్యర్ధుల విషయంలో రాపాకను పార్టీ నాయకత్వం విశ్వాసంలోకి తీసుకోలేదు.

 

పార్టీలోని మరో కీలక నేత గురదత్త ప్రసాద్ ఆధ్వర్యంలోనే అభ్యర్ధుల ఎంపిక, బిఫారాలు అందచేయటం లాంటివన్నీ జరిగిపోయాయి. ఓ ప్రైవేటు హోటల్లో జరిగిన పార్టీ నేతల సమావేశంలో  అభ్యర్ధులపై అభిప్రాయాలను ప్రసాద్ అడిగి తెలుసుకున్నారు.  తర్వాత అభ్యర్ధులను ఎంపిక చేసి ప్రసాద్ బిఫారాలు కూడా ఇచ్చేశాడు.  ఈ మొత్తం వ్యవహారంలో రాపాకను పార్టీ అధిష్టానం ఏ దశలో కూడా జోక్యం చేసుకోనీయలేదు.

 

నిజానికి మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అఖండ మెజారిటితో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రాపాక అనేక సందర్భాల్లో వైసిపి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. అదే సమయంలో పవన్ కూడా రాపాకను ఏనాడు దగ్గరకు రానీయలేదు. పార్టీ తరపున గెలిచిన రాపాకకు పవన్ ప్రతి స్ధాయిలోను ప్రాధాన్యత ఇస్తారనే అందరూ అనుకన్నారు. కానీ ఆశ్చర్యకరంగా చాలా కమిటీల్లో  రాపాకకు పవన్ అసలు చోటే కల్పించలేదు.

 

ఈ కారణంగానే మనస్తాపానికి గురైన రాపాక కూడా ఇటు పవన్ తో పాటు అటు జనసేనకు కూడా దూరమైపోయాడు. ఎటూ పార్టీకి దూరమైపోయాడు కాబట్టే అధికారపార్టీ నేతలతోనే సన్నిహితంగా మెలుగుతున్నాడు. స్కూళ్ళల్లో  ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టటాన్ని పవన్ తీవ్రంగా వ్యతిరేకించాడు. రాపాక మాత్రం జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి మద్దతుగా మాట్లాడాడు. అలాగే మూడు రాజధానుల ప్రతిపాదనను పవన్ ఎంత తీవ్రంగా వ్యతిరికించాడో రాపాక అంత మద్దతిస్తు మాట్లాడాడు. అందుకనే రాపాక అసలు జనసేనలో ఉన్నాడో లేదో కూడా తనకు తెలీదని పవన్ బహిరంగంగానే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మొత్తానికి పార్టీ నుండి రాపాకను దూరంగా పెట్టేసినట్లే అనుకోవాలి.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: