ఏపీపై తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు కుట్రలు కొన‌సాగుతున్నాయ‌ని వైసీపీ మండిప‌డింది. చంద్రబాబు కుట్రలో ఎన్నికల అధికారి భాగమయ్యారని ఆరోపించారు. తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర నిధులు అడ్డుకోవడానికి చంద్రబాబు కుట్ర చేశారని పేర్కొన్నారు. ``ఎన్నికలు జరిగితే కేంద్రం నుంచి 5,800 కోట్లు వస్తాయి. కానీ వాటిని రాకుండా ఉండేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఎన్నికల కోడ్ పేరుతే అధికారాలను చేతిలో ఉంచుకోవడం నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేస్తున్న కుట్ర కాదా?-గతంలో ఇంతకంటే పెద్ద సంఘటనలు జరిగినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు? చెదురుమదురు ఘటనలను పెద్దవిగా చూపే కుట్ర చేస్తున్నారు.తనకు ఉద్యోగం ఇచ్చిన చంద్రబాబు రుణం తీర్చుకునేందుకు నిమ్మగడ్డ రమేష్ తాపత్రయపడుతున్నారు.`` అని అంబ‌టి మండిప‌డ్డారు.

 


శాసన మండలిని కూడా చంద్రబాబు భ్రష్టుపట్టించారని అంబ‌టి ఆరోపించారు. ``కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేశామని చెబుతున్నారు. ఎన్నికలు వాయిదా వేయడం వల్ల కరోనా ఆగిపోతుందా? ఏ విధమైన చర్యలు లేకుండా ఎన్నికలు వాయిదా వేయడం సరికాదు. రాష్ర్టంలో కరోనా ప్రభావం లేదు.` అని పేర్కొన్నారు. వ్య‌వస్థ‌లను మేనేజ్ చేయడం చంద్రబాబుకు కొత్త కాదని అంబ‌టి అన్నారు. 

 

ఎన్నిక‌ల వాయిదా నిర్ణయం వల్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నష్టం లేదని అయితే, అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోకూడదనే త‌మ ఆవేదన అని అంబ‌టి స్ప‌ష్టం చేశారు. ``ఎన్నికలు ఎప్పుడు పెట్టినా మేమే గెలుస్తాం. వాయిదా నిర్ణయంపై పునరాలోచన చేయాలని కోరుతున్నాం. ఎన్నికల కమిషన్ ఏ నిర్ణయం తీసుకున్నా రాజ్యాంగబధ్ధంగా తీసుకోవాలి. చంద్రబాబుకు చెప్పి నిర్ణయం తీసుకుంటే సరిపోతుందా?`` అని ప్ర‌శ్నించారు. ``రిటైరై ఖాళీగా ఉన్ననిమ్మగడ్డను 2016లో రాష్ర్ట ఎన్నికల అధికారిగా చంద్రబాబు నియమించారు. ఇంత కీలకమైన నిర్ణయం తీసుకునేముందు ఎవరిని సంప్రదించారు? కరోనా వైరస్ వల్ల కాదు...క్యాస్ట్ వైరస్ వల్లనే ఎన్నికలు వాయిదా ప‌డ్డాయి`` అని వ్యాఖ్యానించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: