వైసీపీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని తీసుకున్న నిర్ణయం గురించి ఘాటుగా స్పందించారు. ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ కరోనా వల్ల ఎన్నికలు వాయిదా వేస్తున్నామని చెప్పడం దారుణం అని అన్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాకపోయినా, ఎన్నికల కమిషన్ కు మాత్రం కరోనా సోకిందని విమర్శలు చేశారు. 
 
ఈసీకి చంద్రబాబు వైరస్ సోకిందో మరే ఇతర వైరస్ సోకిందో తనకు తెలియదు కానీ... అంతు చిక్కని వైరస్ సోకడం వల్లే ఎన్నికల కమిషనర్ అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియ ఐదు రోజుల్లో ముగుస్తున్న సమయంలో ఈసీ ఆరు వారాల పాటు ఎన్నికలు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకోవడం వైరస్ సంభవించడం వల్లే జరిగి ఉండవచ్చని అన్నారు. 
 
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన రోజు నుండి రమేష్ కుమార్ గురించి తాము జగన్ కు చెబుతూనే ఉన్నామని చెప్పారు. ఆయన కుట్రపూరితంగా ఎన్నికల కమిషనర్ అయ్యారని, చంద్రబాబు సొంత మనిషి, దగ్గరి బంధువు అని తాను, ఇతర నాయకులు జగన్ కు చెప్పినా సీఎం ఆ సమయంలో పెద్దగా పట్టించుకోలేదని అన్నారు. పలు సందర్భాల్లో రమేష్ కుమార్ పదవిపై పునరాలోచించాలని తాను జగన్ కు సూచించానని తెలిపారు. 
 
జగన్ ఆ సమయంలో చంద్రబాబు బంధువు అయినంత మాత్రాన మరో విధంగా చూడకూడదని, ఐఏఎస్‌లను వారిలాగే చూడాలని తనకు చెప్పారని వ్యాఖ్యానించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా స్థానిక ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని ఆపలేరని అన్నారు. ఎన్ని కుట్రలు చేసినా ఎన్నికల్లో వైసీపీ భారీ మెజారిటీతో గెలవనుందని పేర్కొన్నారు.                         

మరింత సమాచారం తెలుసుకోండి: