ఏపీలో స్థానిక ఎన్నికలు వాయిదా వెనుక రాజకీయ కారణాలున్నాయంటూ విస్తృత చర్చ నడుస్తోంది. కరోనా ప్రభావంతో ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన వెంటనే...ఇద్దరు ఐఏఎస్‌లతో పాటూ పలువురు పోలీసు అధికారులపై బదిలీ వేటు వేస్తున్నట్లు తెలిపింది ఈసీ. ఎన్నికల ముందు అధికారుల బదిలీలు సాధారణమే అయినప్పటికీ....నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత ట్రాన్స్ ఫర్స్ చేయడం వెనుక కారణాలపై చర్చ మొదలైంది.

 

రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయంతో పలు జిల్లాల్లో కలకలం రేగింది. చిత్తూరు, గుంటూరు జిల్లాల కలెక్టర్లపై ఈసీ బదిలీ వేటు వేయడంతో....అందరినీ షాక్‌కు గురిచేసింది. గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్‌ ఆనంద్‌ తో పాటూ, ఎస్పీ విజయారావు, మాచర్ల సీఐలను సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. నామినేషన్ల సందర్భంగా జరిగిన గొడవలే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఎన్నికల ముందు సాధారణ బదీలీ జరగడం కాకుండా...ఇలా నామినేషన్లు పూర్తయిన తర్వాత బదిలీ వేటు పడటం సంచలనంగా మారింది.

 

మాచర్లలో టీడీపీ నేతలు బోండా ఉమా, బుద్దా వెంకన్నలపై జరిగిన దాడి కారణంగానే గుంటూరు జిల్లాకు చెందిన అధికారులపై వేటు పడిటనట్లు తెలుస్తోంది.  టీడీపీ నేతలపై దాడిపై మాజీ సీఎం చంద్రబాబు డీజీపీని కలిసి ఫిర్యాదు చేయడం, దాడికి సంబంధించి విస్తృతంగా ప్రచారం జరుగడంతో.. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. 

 

మరోవైపు చిత్తూరు జిల్లాలో కూడా నామినేషన్ల సందర్భంగా జరిగిన గొడవలపై ఈసీ సీరియస్ యాక్షన్ తీసుకుంది. అధికార పార్టీకి చెందిన వ్యక్తులు దాడులు చేశారని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదనే కారణంతో చిత్తూరు జిల్లా కలెక్టర్‌ భరత్ నారాయణ్ గుప్తాతో పాటూ తిరుపతి అర్భన్ ఎస్పీలను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది ఈసీ. 
చంద్రగిరి, శ్రీ కాళహస్తి, తిరుపతి, పుంగనూరు నియోజకవర్గాల్లో నామినేషన్ల సందర్భంగా పలు చోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ప్రతిపక్షాలకు చెందిన అభ్యర్ధుల నుంచి నామినేషన్ పత్రాలను లాక్కొని పారిపోవడంతో పాటూ, పత్రాలను చించివేయడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి.  వీటిపై స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ....పట్టించుకోలేదనే ఆరోపణలు వచ్చాయి. దీంతో జోక్యం చేసుకున్న రాష్ట్ర ఎన్నికల సంఘం...కలెక్టర్‌తో పాటూ తిరుపతి అర్బన్ ఎస్పీ, పలమనేరు, శ్రీకాళహస్తి డీఎస్పీలు, పుంగనూరు సీఐలను బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

 

ఈ మొత్తం వ్యవహారంలో ప్రతిపక్షాల ఫిర్యాదులతో పాటూ దాడులకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీటిని కూడా ఈసీ పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: