కాంగ్రెస్ సార‌థ్యంలోని మ‌ధ్య‌ప్ర‌దేశ్ స‌ర్కారుకు నేడు క‌ఠోర ప‌రీక్ష ఎదురుకానుంది. పార్టీ యువ‌నేత‌గా ఉన్న జ్యోతిరాధిత్య సింధియా తిరుగుబాటుతో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఈ ప‌రీక్ష‌ను ఎదుర్కోనుంది. సీఎం కమల్‌నాథ్ సర్కార్‌ బల నిరూపణ చేసుకోవాలని గవర్నర్ టాల్జీ టాండన్ ఆదేశించారు. మధ్యప్రదేశ్ శాసనసభ స్పీకర్ ఎన్పీ ప్రజాపతి… ఆరుగురు రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించారు. వీరంతా కమల్నాథ్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేశారు. దీంతో బీజేపీ బ‌ల‌ప‌రీక్ష కోరింది. 

 

నేటి నుంచి మధ్యప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ ప్రసంగం పూర్తి అయిన వెంటనే, అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నిర్వహించనున్నట్లు లాల్జీ టాండన్ తెలిపారు. బల పరీక్ష నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలు అందరికీ విప్ జారీ చేసింది. మార్చి 16 నుంచి ఏప్రిల్ 13 వరకు నిర్వహించే అసెంబ్లీ సమావేశాలకు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించింది. బడ్జెట్ సెషన్లో ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలని స్పష్టం చేసింది. కాగా, బీజేపీ, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మృతి చెందడంతో 2 సీట్లు ఖాళీగా ఉన్నాయి. స్వతంత్రులు, బీఎస్పీ, ఎస్పీ సభ్యులు కాంగ్రెస్‌ సర్కార్‌కు మద్దతిస్తున్నారు.

 

కమల్‌నాథ్‌ కేబినెట్‌లో మంత్రులుగా ఉండి ఉద్వాసనకు గురైన ఆరుగురు ఎమ్మెల్యేల రాజీనామాలకు స్పీకర్‌ ఎన్‌పీ ప్రజాపతి ఆమోదం తెలిపారు. ఎమ్మెల్యేలు ఇమ్రతీదేవీ, తులసీషీలావట్‌, పి.సింగ్‌థోమర్‌, మహేంద్రసింగ్‌, గోవింద్‌సింగ్‌, పి.రామ్‌చౌదరీలు తమ పదవులకు రాజీనామా చేశారు. మంత్రివర్గం నుంచి తొలగించిన అనంతరం సింధియా వర్గంలో ఆరుగురు ఎమ్మెల్యేలు చేరిపోయారు. భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్‌ రాష్ట్ర నాయకులు గవర్నర్‌ లాల్జీ టాండన్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారు అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్‌కు వినతిపత్రం అందించారు. అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలనీ.. అదే సమయంలో వీడియో కూడా తీయాలని వారు గవర్నర్‌ను కోరారు. కాగా,ఈ బ‌ల‌పరీక్ష‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌ను బీజేపీ ప్ర‌లోభ పెడుతోంద‌ని హ‌స్తం పార్టీ ఆరోపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: