మానవజాతిని ప్రభావితం చేసిన విద్యుత్ బల్బు, ఫోనోగ్రాఫ్ లాంటి అనేక ఉపకరణాలను రూపొందించిన గొప్ప అమెరికన్ వ్యాపారవేత్త థామస్ అల్వా ఎడిసన్. అమెరికాలోని ఓహియో రాష్ట్రానికి చెందిన మిలన్ అనే ప్రాంతంలో ఎడిసన్ జన్మించారు. చిన్నతనంలో ఎడిసన్ ఒక వార పత్రికకు పేపర్ బాయ్ గా పని చేశారు. ఒకరోజు, ఎడిసన్ పాఠశాల నుండి ఇంటికి వచ్చి ‘అమ్మా.. ఈ లెటర్‌ నీకిమ్మంది మా టీచర్‌..’ అని చెప్పాడు. 
 
లెటర్ చదివిన తల్లి కళ్ల నిండా నీళ్లు పెట్టుకుంది. ఆ లెటర్ లో " మీ అబ్బాయి ఒక మేధావి. ఈ స్కూల్ తనకు సరైంది కాదు. ఈ స్కూల్ లో సమర్థులైన ఉపాధ్యాయులు లేరు. మీ అబ్బాయికి మీరే చదువు చెప్పండి. " అని రాసి ఉందని తల్లి కొడుకుతో చెప్పింది. ఆనాటి నుండి అతని తల్లే గురువై విద్యాబుద్ధులు నేర్పించింది. కొన్ని సంవత్సరాల తర్వాత పాత బీరువాలో ఎడిసన్ కు ఒక లెటర్ కనిపించింది. అది చిన్నప్పుడు తన టీచర్ అమ్మకు రాసింది. ఆ లెటర్ లో "థామస్ అల్వా ఎడిసన్ అనే మీ అబ్బాయి మానసిక వికలాంగుడు. అతడిని ఈ స్కూల్ ఏ మాత్రం భరించలేదు. కాబట్టి అతడిని బహిష్కరించడం జరిగింది" అని రాసి ఉంది. 
 
ఎడిసన్ తల్లి అతడిని ప్రపంచమంతా గర్వపడే మేధావిగా తయారు చేసింది. ఆ శతాబ్డంలోనే ఎడిసన్ ఒక గొప్ప శాస్త్రవేత్త అయ్యాడు. ఎడిసన్ అతి చిన్న వయస్సులోనే టెలిగ్రాఫ్ నమూనా యంత్రాన్ని తయారు చేశాడు. " గ్రాంట్ ట్రంక్ హెరాల్డ్ " పేరుతో 1861లో ఒక పత్రిక నడిపాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తూ ఆయనకు చెవుడు వచ్చింది. 
 
1862లో ఎడిసన్ ఒక స్టేషన్ మాస్టర్ బిడ్డను ప్రమాదం నుండి రక్షించి ఆయన వద్ద నుండి టెలీగ్రఫీని నేర్చుకున్నాడు. 1868లో టెలిగ్రాఫ్ పేటెంట్ ను పొందగలిగాడు. తన టెలిగ్రాఫ్ పరికరాన్ని అమ్మగా 40,000 డాలర్లు రావడంతో ఆశ్చర్యపోయాడు. ఎడిసన్ 1878లో ఎలక్ట్రిక్ బల్బ్ ను కనిపెట్టాడు. బల్బును కనిపెట్టడంలో ఎన్నో ప్రయత్నాలు చేసి ఓడిపోయినా మరలా ప్రయత్నించి ఎడిసన్ విజయం సాధించాడు. జీవితంలో ఎన్నిసార్లు ఓడిపోయినా మొదటినుంచి ప్రారంభించి పట్టుదలతో, అంకితభావంతో పని చేసి విజయం సాధిస్తారు అనడానికి గొప్ప ఉదాహరణ థామస్ అల్వా ఎడిసన్. 

మరింత సమాచారం తెలుసుకోండి: