ఏపీలో ఎవరూ ఊహించని విధంగా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే. టీడీపీ చాలా రోజుల నుండి స్థానిక ఎన్నికల ప్రక్రియ, ఈసీ పనితీరు, ఇతర విషయాల గురించి విమర్శలు చేస్తూనే ఉంది. ఇదే సమయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిన్న అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించి ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక బీజేపీ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. 
 
రాష్ట్రంలో బీజేపీ జనసేన పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. కొన్ని జిల్లాల్లో వైసీపీ జనసేన - బీజేపీ నేతల నామినేషన్లను బెదిరించి ఉపసంహరించేలా చేసినట్లు వార్తలు వచ్చాయి. ఏపీలో గత కొన్ని నెలలుగా బలపడాలని ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ ఈ పరిస్థితులను చూసి రంగంలోకి దిగిందని సమాచారం. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థులు నామినేషన్లు కూడా వేయలేని పరిస్థితి ఏపీలో ఉండటంతో బీజేపీ ఎన్నికలు వాయిదా పడేలా చేసిందని సమాచారం. 
 
కొన్ని రోజుల క్రితం రాష్ట్రంలో నామినేషన్ల సమయంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయని జీవీఎల్ నరసింహారావు, ఇతర నేతలు అమిత్ షాకు లేఖ రాశారు. ఏపీలో ఎన్నికలు జరుగుతున్న పరిస్థితులను అమిత్ షాకు వివరించారు. అమిత్ షా లేఖను పరిశీలించి చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చినట్లు వార్తలు వినిపించాయి. రెండు రోజుల క్రితం మాచర్లలో బీజేపీ - జనసేన కూటమి అభ్యర్థితో బలవంతంగా నామినేషన్ ఉపసంహరించేస్తున్న ఫోటోలు బయటకు వచ్చాయి. 
 
బీజేపీ నేతలు ఢిల్లీకి మాచర్ల ఘటనకు సంబంధించిన నివేదికను పంపారు. అదే సమయంలో కేంద్రం కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉండటంతో కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ఎన్నికల నిర్వహణ గురించి కేంద్రాన్ని సంప్రదించగా అమిత్ షా సూచనల మేరకు కేంద్ర వర్గాలు ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేయాలని సూచించాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్ర వర్గాలు ఎన్నికలు వాయిదా వేయాలని సూచించినట్లు ప్రెస్ నోట్ లో పేర్కొంది. వైసీపీ బీజేపీపై దాడులు చేయడంతో రాష్ట్రంలో ఎన్నికలు వాయిదా పడ్డాయని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: