సాధారణంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు వేలకు వేలు జీతాలు తీసుకుంటూ విధులకు సరిగ్గా హాజరు కారనే విమర్శలు ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో దాదాపు ఇదే పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల వైద్యులు ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా విధులు నిర్వహిస్తుంటారు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో రోగులు పడే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. 
 
ప్రజల నుండి ప్రభుత్వ వైద్యుల గురించి తరచూ ఫిర్యాదులు వస్తూ ఉండటంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో డాక్టర్లపై కొరడా ఝళిపించింది. ఇప్పటివరకు 700 మంది డాక్టర్లు రిపోర్ట్ చేయకపోవడంతో వారిని డిస్మిస్ చేయాలని నిర్ణయం తీసుకుంది. వీరితో పాటు విధులకు సరిగ్గా హాజరు కాని డాక్టర్లపై చర్యలు తీసుకోనున్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ప్రతాప్ సింగ్ మీడియాకు చెప్పారు. 
 
 
జన్ ఆరోగ్య మేళాలో ఆకస్మిక తనిఖీలు చేసిన ప్రతాప్ సింగ్ కొందరు డాక్టర్లు సరిగ్గా విధులకు హాజరు కావడం లేదని గుర్తించారు. ప్రభుత్వ డాక్టర్ల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు డాక్టర్లు సమాచారం ఇవ్వకుండా ఉన్నత చదువులు చదువుతున్నారని, డ్యూటీలకు హాజరు కాకుండా ఇతర ప్రాంతాలకు వెళుతున్నారని తెలిసి మంత్రి సీరియస్ అయ్యారు. 
 
వైద్యుల తీరుతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని... ప్రభుత్వం ఇచ్చే జీతాలు తీసుకుంటూ విధులకు హాజరు కాకపోవడం కరెక్ట్ కాదని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో డాక్టర్ల డిస్మిస్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, త్వరలోనే విధులు సరిగ్గా నిర్వహించని డాక్టర్లను విధుల నుండి తొలగిస్తామని చెప్పారు. ప్రజలు కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదని కేంద్రం వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి తగిన చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విధులకు హాజరు కాని డాక్టర్లపై ఇలాంటి చర్యలు తీసుకోవడం కరెక్టే అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: