క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్‌ను పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా ఎంపికచేయ‌డం వెనుక బీజేపీ అధిష్ఠానం పెద్ద క‌స‌ర‌త్తే చేసిన‌ట్లుగా తెలుస్తోంది. 2024లో తెలంగాణ‌లో  అధికారం సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా అమిత్ షా బీసీల‌కు రాజ్యాధికారం అస్త్రాన్నిప్ర‌యోగించిన‌ట్లుగా ఆ పార్టీ రాష్ట్ర నేతలు చెబుతున్నారు. ఫైర్ బ్రాండ్‌గా, యూత్‌లో మంచి క్రేజ్ ఉండ‌టం, విద్యార్థి ద‌శ నుంచే ఆర్ ఎస్ ఎస్ భావ‌జాలం క‌లిగి ఉండ‌టం వంటి కార‌ణాలతో బండి సంజ‌య్ ఎంపిక వైపు  మోదీ, షాలు మొగ్గు చూపిన‌ట్ల తెలుస్తోంది. అంతేకాక  సంజ‌య్‌కు బీసీ సామాజిక‌వ‌ర్గంలో మంచి ప‌ట్టు ఉండ‌టంతో  పార్టీ బ‌లోపేతం, విస్తృతం జ‌రుగుతాయ‌ని  కూడా భావించిన‌ట్లు తెలుస్తోంది.  



వాస్త‌వానికి తెలంగాణ‌లో అత్య‌ధిక ఓట్లు బీసీ సామాజికవ‌ర్గానిదే. హైద‌రాబాద్‌లోని ముస్లిం ప్రాబ‌ల్య ఓట‌ర్ల నియోజ‌క‌వ‌ర్గాలు మిన‌హా ఇక దాదాపు అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ అభ్య‌ర్థుల గెలుపోట‌ముల‌ను శాసించేది ఈ సామాజిక వ‌ర్గ‌మే. అయితే ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి కూడా తెలంగాణ బీసీ నేత‌ల‌కు పెద్ద ప‌దవులు ద‌క్కింది లేదు. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన బీజేపీ రాష్ట్రంలో బ‌ల‌ప‌డాలంటే ముందు బీసీల‌కు ద‌గ్గ‌ర‌కు కావాల‌ని వ్యూహ ర‌చ‌న చేసిన‌ట్లు స‌మాచారం.  అయితే ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన నాటి నుంచి తెలంగాణ‌లో బీసీ నేత‌లు ఎక్కువ‌గా ఆ పార్టీలోనే కొన‌సాగారు.



అయితే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం త‌ర్వాత వారు త‌లోదిక్కు అన్న‌ట్లుగా వేర్వేరు పార్టీల్లో చేర‌గా మ‌రికొంత‌మంది మాత్రం ఇప్ప‌టికీ అదే పార్టీలో కొన‌సాగుతూ రాజ‌కీయాల్లో ఉండీ లేన‌ట్లుగా ఉంటున్నారు.  ఇప్పుడు బీజేపీ వారంద‌రినీ పార్టీలోకి లాక్కునే ప్ర‌య‌త్నం మొద‌లుపెట్టింది. గ‌తంలోనే ఈ ఆక‌ర్ష్‌కు శ్రీకారం చుట్టినా ఇప్పుడు మ‌రింత వేగిరం చేసింది.  ఈ కోవ‌లోనే టీడీపీ సీనియర్ నాయకుడు దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ తో పాటు పలువురు బీసీ నాయకులను పార్టీలో చేర్చుకోవడం వ్యూహంలో భాగమేనన్న అభిప్రాయాలను పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. బీసీ వ‌ర్గానికి ఇప్ప‌టికే జాతీయ‌స్థాయి ప‌ద‌వుల్లో..హోదాల్లో ప్ర‌ధానిమోదీ,అమిత్‌షా ప్రాధాన్యం ఇస్తున్న‌ట్లుగా గురిపెట్టిన కొంత‌మంది నేత‌ల‌కు బీజేపీ అగ్ర‌నాయ‌క‌త్వం గుర్తు చేస్తోంది.

 అదే వర్గానికి చెందిన తమిళిసైని తెలంగాణకు గవర్నర్‌గా నియమించ‌డం వెనుక కూడా ఈ వ్యూహ‌మే దాగుంద‌ని చెబుతున్న వారూ ఉన్నారు.  తెలంగాణ  బీసీ వర్గానికే చెందిన దత్తాత్రేయను హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌గా అవకాశం క‌ల్పించిన విష‌యాన్ని రాష్ట్ర నేత‌లు గుర్తు చేస్తున్నారు. బండి సంజ‌య్‌ను బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా ఎంపిక‌చేయడంతో ఇటు టీఆర్ ఎస్ అటు కాంగ్రెస్‌లో ప్రాధాన్యం ద‌క్క‌ని నేత‌ల‌కు ఆశ‌లు రేపుతోంది. బీసీల‌కే  ముఖ్య‌మంత్రి ప‌ద‌వి అంటూ చేసిన‌ ఆఫ‌ర్ కొంత‌మంది అధికారంలో ఉన్న మంత్రుల స్థాయి నేత‌ల‌ను కూడా ఊరిస్తోంద‌ని స‌మాచారం. ఇప్ప‌టికీ ఆ పార్టీలో బీసీల‌కు పెద్ద ప్రాధాన్యం లేక‌పోవ‌డంతో బీజేపీ వ్యూహం ఫ‌లిస్తుంద‌న్న ధీమాతో ఆ పార్టీ నేత‌లు ఉండ‌టం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: