అనుకున్న‌ది ఒక‌టి.. అయిన‌ది ఒక‌టి బోల్తా కొట్టిందిలే రేవంత్ అంటూ కారు పార్టీ నేత‌లు హుషారుగా పాటేసుకుంటున్నారు. దొర‌క‌బ‌ట్టించ‌బోయి..తానే దొరికిపోయిన‌ట్లుగా ఉంది మ‌ల్కాజిగిరి ఎంపీ, కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి ప‌రిస్థితి. ఆక్ర‌మించుకున్న భూమిలో కేటీఆర్ ఫాంహౌస్ నిర్మించుకున్నాడంటూ డ్రోన్ కెమెరాతో చిత్రీక‌రించిన కేసులో రేవంత్‌ను  పోలీసులు అరెస్టు చేసి జైలులో పెట్టిన విష‌యం తెలిసిందే. నాటి నుంచి ఆయ‌న బెయిల్ కోసం ప్ర‌య‌త్నం చేస్తున్న మంజూరుకు కోర్టు నిరాక‌రించింది. మ‌రోవైపు త‌న సోద‌రుడితో క‌ల‌సి రేవంత్ భూకబ్జాకు పాల్ప‌డిన‌ట్లుగా రెవెన్యూ  అధికారులు ప్ర‌భుత్వానికి నివేదిక స‌మ‌ర్పించ‌డం ఆయన జైలుకెళ్లిన  మ‌రునాడే జ‌ర‌గ‌డం విశేషం.



రెండు మూడు రోజులుగా ఓ మీడియా చానెల్‌లో రేవంత్ అక్ర‌మాల‌పై వ‌రుస‌గా క‌థ‌నాలు వ‌స్తుండ‌టంతో ఆయ‌న అనుచ‌రుల్లోనూ విస్మ‌యం క‌లిగిస్తోంది. రేవంత్ క‌ష్టాల్లో ఉన్నా పార్టీ నేత‌ల నుంచి క‌నీస స్పంద‌న క‌రువైంది. వీహెచ్‌, జ‌గ్గారెడ్డి లాంటి నేత‌ల‌యితే రేవంత్ వైఖ‌రినే త‌ప్పుబ‌డుతుండ‌టం గ‌మ‌నార్హం. త‌న‌కు తాను పోలిటిక‌ల్ హీరోగా రేవంత్ భావిస్తుండ‌టం వ‌ల్లే చిక్కులు వ‌స్తున్నాయ‌న్న విమ‌ర్శ‌లు పార్టీ వ‌ర్గాల నుంచి వ‌స్తున్నాయి. ఆయ‌న వైఖ‌రితో పార్టీకి తీవ్ర న‌ష్టం క‌లుగుతోంద‌న్న వాద‌న‌ను చాలామంది ముఖ్య‌నేత‌లు అధిష్ఠానం పెద్ద‌ల దృష్టికి తీసుకెళ్లిన‌ట్లుగా తెలుస్తోంది.



రాష్ట్ర రాజ‌కీయాల్లో క్రేజీ ఉన్న రేవంత్‌రెడ్డి..చిల్ల‌ర మ‌ల్ల‌ర వ్య‌వ‌హారాల‌తో, అర్థంలేని రాజ‌కీయ చ‌ర్య‌ల‌తో హీరో స్థాయి నుంచి జీరోగా మారిపోయాడ‌న్న విమ‌ర్శ‌లు వినబ‌డుతున్నాయి. కేసీఆర్‌ను ఢీకొట్ట‌గ‌లిగే స‌త్త కేవ‌లం రేవంత్‌రెడ్డికే ఉంద‌న్న అభిప్రాయం రాష్ట్ర రాజ‌కీయ వ‌ర్గాల్లో ఉండేది. ముంద‌స్తు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కొడంగ‌ల్‌లో ఓట‌మి పాలైన‌ప్ప‌టికీ ఆయ‌న‌పైనా పార్టీలో, రాష్ట్రంలో ఆయ‌న‌కు అభిమానులు పెరిగారు. తిరిగి మ‌ల్కాజిగిరిలో ఎంపీగా పోటీ చేసి విజ‌యం సాధించారు. కేసీఆర్ కుటుంబ స‌భ్యుల‌పై అవినీతి, అక్ర‌మాల‌కు సంబంధించిన ఆరోప‌ణ‌లు చేస్తూ రాజ‌కీయ ఉనికిని కాపాకునే ప్ర‌య‌త్నం చేశార‌న్న అభిప్రాయం ఇప్పుడు స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: