జగన్మోహన్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలను చూస్తుంటే అదే అనిపిస్తుంది. మామూలుగా ఎన్నికల కమీషన్ అనేది రాజ్యాంగబద్దంగా ఏర్పడిన వ్యవస్ధ. కాబట్టి ఎన్నకల కమీషన్ జోలికి మామూలుగా ఏ ప్రభుత్వం కూడా వెళ్ళదు. ఎన్నికలు జరపటం వరకే దాని బాధ్యత. అంతేకానీ ఇష్టం వచ్చినట్లు ఎన్నికలను నిలిపేయటం, వాయిదా వేయటం ఎన్నికల కమీషన్ కు కూడా సాధ్యంకాదు. ఎందుకంటే ఎన్నికలను నిలిపేయాలన్నా, వాయిదా వేయాలన్నా ప్రభుత్వంతో చర్చించిన తర్వాతే ఎన్నికల కమీషన్ నిర్ణయాన్ని ప్రకటించాలి.

 

కానీ ఇక్కడ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం వ్యవహారం మాత్రం విచిత్రంగా ఉంది. తెలుగుదేశంపార్టీ నేతలు కరోనా వైరస్ ను బూచిగా చూపించి స్ధానిక సంస్ధల ఎన్నికలను వాయిదా వేయాలని శనివారం డిమాండ్ చేశారు. ఆదివారం ఉదయానికి కరోనా వైరస్ కారణంగా ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు రమేష్ కుమార్ ప్రకటించేశారు. ఎన్నికల వాయిదా అంశాన్ని రమేష్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కానీ మెడికల్ అండ్ హెల్త్ ప్రిన్సిపుల్ సెక్రటరీతో కూడా చర్చించలేదు. కనీసం పంచాయితీ రాజ్ ముఖ్య కార్యదర్శితో కూడా మాట్లాడలేదు.

 

ఎవరితోను చర్చించకుండా ముఖ్యమంత్రి అభీష్టం ఏమిటో తెలుసుకోకుండానే ఎన్నికల కమీషన్ ఏకపక్షంగా ఎలా ఎన్నికలను వాయిదా వేసిందో అర్ధం కావటం లేదు. ఇక జగన్ ఈరోపణలను చూస్తే చంద్రబాబునాయుడు ఆదేశాల ప్రకారమే రమేష్ నడుచుకుంటున్నట్లు అర్ధమవుతోంది. పైగా ఈనెలఖరులోగా ఎన్నికలు జరగకపోతే కేంద్రం నుండి రావాల్సిన రూ. 5 వేల కోట్లు ఆగిపోతాయని తెలిసి కూడా ఎన్నికల కమీషన్ ఎన్నికలను వాయిదా వేసిందంటేనే  చంద్రబాబు-రమేష్ బంధం ఎంత గట్టిగా ఉందో తెలిసిపోతోంది.

 

మామూలుగా సామాజికవర్గం అనో లేకపోతే ఇంకేదో కారణంతోనో కొందరు ఉన్నతాధికారులకు పాలకులతో గట్టి సంబంధాలే ఉంటాయి. అయితే పాలకులు మారినపుడు అటువంటి ఉన్నతాధికారులు తమ ఆలోచనలు బయటపడకుండా సర్దుకుంటారు. కానీ రమేష్ కుమార్ అటువంటి వాటిని పట్టించుకున్నట్లు లేదు. అందుకనే జగన్ అభీష్టానికి విరుద్ధమని తెలిసినా చంద్రబాబు కోరకుంటున్నట్లే పనిచేస్తున్నారు. మరి విషయం గవర్నర్ దగ్గరకు వెళ్ళింది కాబట్టి ఏమి జరుగుతుందో చూడాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: