గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. రమేష్ కుమార్ ఎన్నికల వాయిదా, సీఎం జగన్ చేసిన ఆరోపణల గురించి గవర్నర్ తో చర్చించారు. కరోనా నివారణ, నామినేషన్ల సందర్భంగా రాష్ట్రంలో పలు ప్రాంతాలలో చోటు చేసుకున్న హింస గురించి ఎన్నికల కమిషనర్ గవర్నర్ తో చర్చించినట్లు తెలుస్తోంది. దాదాపు 40 నిమిషాల పాటు వీరిద్దరి మధ్య భేటీ జరిగింది. 
 
నిన్న స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు రమేష్ కుమార్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. గవర్నర్ తో రాష్ట్రంలో కొందరు అధికారులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని చెప్పటంతో పాటు వాటికి సంబంధించిన ఆధారాలను గవర్నర్ కు రమేష్ కుమార్ అందజేసినట్లు సమాచారం. కేంద్రం కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించటంతో అప్రమత్తంగా ఉండాలనే ఎన్నికలను వాయిదా వేశామని గవర్నర్ కు చెప్పినట్లు తెలుస్తోంది. 
 
ప్రజా భద్రతను దృష్టిలో పెట్టుకుని ఎన్నికలను వాయిదా వేశామని గవర్నర్ కు ఆయన వివరించారని సమాచారం. గతంలో సుప్రీం కోర్టు అత్యవసర పరిస్థితుల్లో ఎన్నికలు వేసుకునే అవకాశం కల్పించిన నేపథ్యంలో అత్యున్నత స్థాయి సమావేశం జరిపి ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటన చేశామని... కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో ఎన్నికలు నిర్వహించడం రాష్ట్ర ప్రజల శ్రేయస్సు దృష్ట్యా మంచిది కాదని గవర్నర్ కు కారణాలను వివరించినట్లు సమాచారం. 
 
ఎన్నికల సందర్భంగా పార్టీలు బహిరంగ సభలు ఏర్పాటు చేస్తే సభలకు భారీ సంఖ్యలో జనం హాజరయ్యే అవకాశం ఉందని .. వారిలో ఎవరికైనా కరోనా ఉంటే ఇతరులకు వ్యాప్తించే అవకాశం ఉంటుందని గవర్నర్ కు ఎన్నికల కమిషనర్ వివరించారు. కేంద్రం కరోనా విషయంలో జారీ చేసిన ఆదేశాలను అమలు చేయాలంటే ఎన్నికలు వాయిదా వేయడం తప్ప మరో మార్గం లేదని... అందువల్లే ఆరు వారాల పాటు ఎన్నికల ప్రక్రియను వాయిదా వేశామని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: