ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ నిన్న స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈసీ నిర్ణయంపై రాష్ట్రంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా హైకోర్టులో మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. నెల్లూరుకు చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు. 
 
ఎన్నికల సంఘానికి నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత ఎన్నికలు వాయిదా వేసే అధికారం ఉండదని పిటిషనర్ పేర్కొన్నారు. హైకోర్టు ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించింది. ఈరోజు మధ్యాహ్నం కోర్టు పిటిషన్ ను విచారించనుంది. హైకోర్టు గతంలో మార్చి 31లోగా ఎన్నికలను కచ్చితంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. గతంలో హైకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికల గురించి పలు పిటిషన్లు దాఖలు కాగా కోర్టు ఎన్నికలు నెలాఖరులోపు నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 
 
ఈసీ కేంద్రం కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. పలు ప్రాంతాలలో ఈసీ తీసుకున్న నిర్ణయంపై ప్రజల నుండి, నాయకుల నుండి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం జగన్ నిన్న కరోనాపై అధికారులతో సమీక్ష అనంతరం గవర్నర్ ను కలిసి షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల కమిషన్ ను ఆదేశించాలని కోరారు. 
 
ఎన్నికల కమిషన్ పై, ఎన్నికల కమిషనర్ పై జగన్ పలు ఆరోపణలు చేశారు. గవర్నర్ ఈసీని వివరణ కోరగా ఈరోజు ఉదయం 11 గంటలకు రమేష్ కుమార్ గవర్నర్ ను కలిసి ఎన్నికలు వాయిదా వేయడానికి గల కారణాలను వివరించారు. కొద్దిసేపటి క్రితమే వీరిద్దరి మధ్య భేటీ ముగిసింది. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు కావడం... పిటిషన్ ను కోర్టు విచారణకు స్వీకరించడంతో హైకోర్టు ఎలాంటి తీర్పునిస్తుందో చూడాల్సి ఉంది. గతంలో కోర్టు మార్చి 31లోగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కు షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: