ఆంధ్రప్రదేశ్ లో టీడీపీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. సాధార‌ణ ఎన్నిక‌లు ముగిసి 9 నెల‌లు అవుతుందో ?   లేదో ?  చాలా మంది కీల‌క నేత‌లు ఆ పార్టీని వీడుతున్నారు. ఇప్ప‌టికే ఏకంగా పార్టీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి దూర‌మ‌య్యారు. ఇక ఇప్పుడు మ‌రి కొంత‌మంది కీల‌క నేత‌లు సైతం పార్టీకి దూర‌మ‌వ్వ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఈ లిస్టులో టీడీపీని న‌ర‌న‌రానా ర‌క్తంలో జీర్ణించుకున్న ప‌రిటాల ఫ్యామిలీ కూడా ఉంది. కొద్ది రోజులుగా ప‌రిటాల ఫ్యామిలీ సైతం టీడీపీని వీడుతోందంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

 

ఈ వార్త‌లు జోరుగా వ‌స్తుండ‌డంతో పాటు చంద్ర‌బాబు ఈ కుటుంబానికి ధ‌ర్మ‌వ‌రం బాధ్య‌త‌లు ఇచ్చినా తీసుకోక పోవ‌డంతో వీళ్లు నిజంగానే పార్టీ మారిపోతున్నారంటూ సందేహాలు వ‌చ్చాయి. ఈ క్రమంలో వాటిపై పరిటాల శ్రీరామ్ స్పందించారు. టీడీపీని వీడుతున్నారంటూ వస్తోన్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన ఆయన సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. టీడీపీలో త‌మ‌కు విబేధాలు ఉన్నాయ‌ని.. తాము పార్టీని వీడుతున్నామంటూ కొంద‌రు అన‌వ‌స‌రంగా ప్ర‌చారం చేస్తున్నారంటూ శ్రీరామ్ మండిప‌డ్డారు.

 

తాము పార్టీ మారుతున్న‌ట్టు వ‌స్తోన్న వార్త‌ల‌ను ఆయ‌న ఖండించారు. సోష‌ల్ మీడియా వేదికగా స్పందించిన శ్రీరామ్ టీడీపీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. త‌మ తండ్రి అయిన దివంగ‌త పరిటాల రవీంద్ర గారి సిద్ధాంతాలతో ఆయన ఆశయసాధన కోసం తెలుగుదేశం పార్టీని బలంగా నమ్మి ప్ర‌జ‌ల్లో ఉన్నామ‌ని శ్రీరామ్ చెప్పారు. తాము ప్రజాభివృద్ధిని కాంక్షిస్తూ నిత్య ప్రజాసేవలో కొనసాగుతున్నామ‌ని.. తాము పార్టీ మార‌డం లేద‌ని.. కావాల‌ని కొంద‌రు ఈ ప్ర‌చారం చేస్తున్నార‌ని శ్రీరామ్ చెప్పారు.

 

తాము ప‌సుపు జెండా వ‌దిలి ప‌క్క జెండా ప‌ట్ట‌మ‌ని... తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దే కుసంస్కృతి మాకు లేదు.. తరాలు మారినా తరగని అభిమానంతో పసుపు జెండా కోసం పని చేస్తాం.. కార్యకర్తలకు అండగా ఉంటామ‌ని.. ఇక‌పై ఇలాంటి నీతిమాలిన రాత‌లు రాసే వారు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని శ్రీరామ్ వార్నింగ్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: