టీడీపీకి షాక్...చంద్రబాబుకు షాక్...ప్రతిపక్షానికి షాక్...2019 అసెంబ్లీ ఎన్నికలు అయిన దగ్గర నుంచి ఈ షాక్ అనే పదం టీడీపీకి అలవాటు అయిపోయింది. ఒక్కసారిగా అధికారం కోల్పోవడంతో కొందరు టీడీపీ నేతలు పార్టీలో ఉండలేక, బీజేపీ, వైసీపీల్లోకి వెళ్ళిపోయారు. అయితే ఈ వలసలు చాలారోజులు సాగాయి. కాకపోతే మూడు రాజధానులు రచ్చ జరిగే సమయంలో ఈ వలసలు కాస్త తగ్గాయి. ఇక ఎప్పుడైతే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొదలైందో, అప్పటి నుంచి మళ్ళీ టీడీపీకి షాకులు తగలడం మొదలయ్యాయి.

 

వరుస పెట్టి టీడీపీ నేతలు వైసీపీ కండువా కప్పుకుంటూనే ఉన్నారు. ఎన్నికలు ఆరు వారాలు వాయిదా పడిన, ఈ వలసలు ఆగట్లేదు. ఇప్పటికే పలువురు బడా నేతలు వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఇక ఎంతమంది వైసీపీలో చేరారు. ఇంకెంతమంది వైసీపీలో చేరుతారనే విషయం కాసేపు పక్కనబెడితే, ఈ వలసల వల్ల వైసీపీకి ఏమన్నా లబ్ది చేకూరుతుందా? అంటే గట్టిగా లాభం జరుగుతుందని చెప్పలేం. ఎందుకంటే వైసీపీ ఎలాగో సూపర్ మెజారిటీతో అధికారంలో ఉంది. ఇక ఒకో నియోజకవర్గంలో వైసీపీలో బోలెడు మంది బడా నేతలు ఉన్నారు. అలాగే టీడీపీలని నేతలని చేర్చుకోపోయిన, స్థానిక సంస్థల ఎన్నికల్లో 80 శాతం పైగా ఫలితాలు తెచ్చుకోగల సత్తా ఉంది.

 

పోనీ నేతలని లాగేసుకోవడం వల్ల  టీడీపీకి ఏమన్నా భారీ నష్టం జరుగుతుందా? అంటే మరి అంత జరగదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీడీపీకి నాయకత్వ కొరత లేదు. అందుకనే ఇలా వరుసగా తమ నేతలు వెళ్ళిపోయినా, టీడీపీ కేడర్ మాత్రం లైట్ తీసుకుంటుంది. పైగా 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు ఇలాగే వైసీపీ నుంచి నేతలని తీసుకోవడం వల్ల, పెద్ద నష్టమే జరిగిందని, నియోజకవర్గంలో పాత, కొత్త నేతల మధ్య ఆధిపత్య పోరు నడిచి చివరికి 23 సీట్లుకి పరిమితమయ్యామని ఇప్పటికీ బాధపడుతున్నారు. ఇప్పుడు టీడీపీ నేతలు వెళ్లిపోవడం వల్ల, పెద్ద నష్టమేమీ లేదని, కానీ భవిష్యత్‌లో మాత్రం రివర్స్‌లో వైసీపీకే నష్టం జరగొచ్చని తెలుగు తమ్ముళ్ళు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు పార్టీ మారే టీడీపీ నేతలే వైసీపీ కొంపముంచుతారని అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: