వైసీపీ సీనియ‌ర్ నేత‌, ఏపీ ఇరిగేషన్ శాఖమంత్రి అనిల్ కుమార్ యాదవ్ పుర‌పాల‌క ఎన్నికల‌ వాయిదాపై ఘాటుగా స్పందించారు. ఎన్నిక‌లు వాయిదా ప‌డ‌టం దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు. తన సామాజికవర్గానికి చెందిన బాగుండాలని ఎన్నికలు వాయిదా నిర్ణయం తీసుకోవడం బాధాకరమ‌ని అనిల్ పేర్కొన్నారు. ``చంద్రబాబుతో చర్చించి ఏకపక్షంగా ఎన్నికలు వాయిదా వేశారు. కరోనా పేరుతో ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని ఊహించలేదు. టీడీపీ కి అభ్యర్థులు నిలబెట్టేందుకు దిక్కు  లేదు. అందుకే నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను అడ్డం పెట్టుకున్నట్టు ఉంది.``అని మంత్రి అనిల్ ఎద్దేవా చేశారు.

 


ఎన్నికల కమిషన్‌కు ఉన్న‌ విచక్షణాధికారం అంటూనే విచక్షణ కోల్పోయి నిర్ణయం తీసుకున్నారు అని మంత్రి అనిల్ ఎద్దేవా చేశారు. ``కరోనా వైరస్ కోసం ఎన్నికలు వాయిదా వేసే ముందు రాష్ట్రంలో అధికారులను ఎవరినైనా సంప్రదించారా? అంత పెద్ద నిర్ణయం తీసుకునేముందు కనీసం ఒక సమీక్ష సమావేశం అయినా పెట్టలేదే? `` అని అనిల్ ప్ర‌శ్నించారు. ``రానున్న రోజులలో మరింత మంది విదేశాల నుంచి వచ్చే అవకాశం ఉంది. పలు దేశాలు అక్కడ ఉన్న మనవాళ్లను వారి స్వదేశాలకు పంపనున్నట్లు సమాచారం ఉంది. అప్పుడు ఏంటి ప‌రిస్థితి?`` అని అనిల్ పేర్కొన్నారు. 


 

ఎన్నికల కోడ్ 45 రోజులు ఉందని అంటూ చంద్రబాబు కుట్ర పూరిత రాజకీయాల కు పాల్పడుతున్నారని అనిల్ ఆరోపించారు. `` ఎన్నికల కమిషనర్ కుమార్తె  గతంలో ఈడీబీలో పని చేశారు. దానికి ప్రతిఫలంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారా చెప్పాలి. బాబుకు ప్ర‌తిఫ‌లం కోసం రాష్ట్ర అభివృద్ధిని ఫణంగా పెడతారా? ఎన్నికలు ఆపేసిన తర్వాత అధికారులను బదిలీ చేసే అధికారం ఆయనకు ఎక్కడిది?  ఫ్రాన్స్ లో 5500 కరోనా కేసులు, కరోనా కారణంగా127 మంది చనిపోతే కూడా అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారు. ఇక్కడ అంత దారుణమైన పరిస్థితి లేదు కదా.? క‌రోనా కన్నా పెద్ద వైరస్ గా చంద్రబాబు తయారు అయ్యారు. ఎన్నికలు ఆపేయాలనే నీచమైన ఎత్తుగడ చంద్రబాబు వేశారు. ఈ నిర్ణయం వెనక్కు తీసుకోవాలని మేం డిమాండ్ చేస్తున్నాం. పవన్ కల్యాణ్ లాంటి వాళ్లు అభ్యర్దులను నిలబెట్టే పరిస్దితి లేదు.అలాంటివాళ్ళు కూడా మాట్లాడితే ఎలా?`` అంటూ ప‌వ‌న్‌పై మంత్రి అనిల్ సెటైర్లు వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: