మొత్తానికి కేంద్రం నుండి ఏపికి రావాల్సిన వేల కోట్లకు సమర్ధవంతంగా గండి పడేట్లే ఉంది. ఈనెల 31వ తేదీలోగా స్దానిక సంస్దల ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నుండి రావాల్సిన సుమారు రూ. 5 వేల కోట్లు ఆగిపోతాయన్న విషయం అందరికీ తెలిసిందే. వేల కోట్లు ఆగిపోతాయన్న ఉద్దేశ్యంతోనే జగన్మోహన్ రెడ్డి యుద్ధ ప్రాతిపదికన ఎంపిటిసి, జడ్పిటిసి, మున్సిపల్, సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నాడు.

 

ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉంది. సర్పంచ్ ఎన్నికలకు మాత్రమే నోటిఫికేషన్ రావాల్సుంది. ఎంపిటిసి, జడ్పిటిసి, మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు అయిపోయింది. చాలా చోట్ల ఏకగ్రీవాలు కూడా అయిపోతున్నాయి. ఇటువంటి సమయంలో  కరోనా వైరస్ వ్యాధిని బూచిగా చూపించి ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హఠాత్తుగా  ఎన్నికలను ఆరువారాల పాటు వాయిదా వేశారు. ఎన్నికలను వాయిదా వేస్తు రమేష్ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది.

 

నిజానికి ఇప్పటికిప్పుడు ఎన్నికలను వాయిదా వేయాల్సినంత అవసరమైతే లేదు.  అయినా రమేష్ ఎన్నికలను ఎందుకు వాయిదా వేశాడో ఎవరకీ అర్ధం కావటం లేదు. ఆరువారాల పాటు ఎన్నికల వాయిదా అంటే కేంద్రం నుండి రావాల్సిన వేల కోట్లు ఆగిపోవటం ఖాయం. ఆ విషయం తెలిసి కూడా ప్రభుత్వంతో కనీసం చర్చించకుండానే ఏకపక్షంగా ఎన్నికలను వాయిదా వేయటం విచిత్రంగానే ఉంది. చూడబోతే కేంద్రం నుండి రావాల్సిన వేల కోట్లు ఆగిపోవాలన్నదే చంద్రబాబు ఆలోచన లాగుంది.

 

తన విచక్షణ మేరకు రమేష్ ఆరు వారాల పాటు ఎన్నికలను వాయిదా వేశారు సరే. ఆ తర్వాత పరిస్ధితి కంట్రోల్ అవుతుందని రమేష్ గ్యారెంటీ ఇవ్వగలరా ? అప్పుడు మళ్ళీ ఎన్నికలను వాయిదా వేస్తారా ? అసలు కరోనా వైరస్ ఎప్పటిలోగా కంట్రోల్ అవుతుందో ఎన్నికల కమీషనర్ చెప్పగలడా ? ఇపుడు రాష్ట్రం మొత్తం మీద బయటపడింది ఒకే ఒక్క కేసు. కాబట్టి మరో పది రోజుల్లో ఎన్నికలు అయిపోతే స్ధానిక ఎన్నికలు అయిపోతాయి. కేంద్రం నుండి రావాల్సిన డబ్బులు కూడా వచ్చేస్తాయి. అసలు కరోనా వైరస్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కానీ ఎన్నికల కమీషన్ ది కానే కాదు. అయినా రమేష్ చేసిన ఓవర్ యాక్షన్ వల్ల ఇపుడు వేల కోట్లు ఆగిపోయే ప్రమాదం పడింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: