తెలంగాణలో కరోనా కట్టడికి ముందు జాగ్రత్తలు అన్ని రంగాలకూ విస్తరిస్తున్నాయి. విద్యాసంస్ధలు, సినిమాహాల్స్, మాల్స్ , షూటింగ్స్ బంద్ లిస్టులో పబ్బులు కూడా చేరాయి. హైదరాబాద్ లో గబ్బులేపే పబ్బులు మూతబడ్డాయ్.. కరోన ప్రభావంతో  హైదరాబాద్ లోని పబ్బులను మూసివేయించారు పోలీసులు. ఈ నెలాఖరు వరకు పబ్బులు మూతబడనున్నాయ్. 

 

కరోనా. ప్రపంచాన్ని కలవరపెడుతున్న వైరస్. వేగంగా విస్తరిస్తూ.. మరణ మృదంగం మోగిస్తోంది.  జన సమర్థం ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా ఈ వైరస్ ఎక్కువగా వ్యాపించే ప్రమాదముంటుంది. ప్రధానంగా నిశిరాత్రిలో  పబ్బుల హంగామా అంతా ఇంతా కాదు. విదేశాల నుంచే వచ్చే ఎన్.ఆర్.ఐ.లు, బడాబాబుల పిల్లలు, పారిశ్రామిక వేత్తలు, బిజినెస్ మెన్లు, సెలబ్రెటీలు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు రాత్రైతే ఈ పబ్బులకు చేరుకుంటారు.  విదేశీయులు ఈ పబ్బుల్లో డ్రగ్స్ విక్రయిస్తూ పట్టుబడిన ఘటనలూ ఉన్నాయ్. పబ్బులకు వచ్చే విదేశీయుల వల్ల కూడా ఈ వైరస్ వ్యాపించే ప్రమాదం ఉంటుంది. పబ్బుల్లో మద్యం తాగుతూ  అందరూ ఒకే చోట గుమిగూడి ఉండి డ్యాన్సులు చేస్తుంటారు. మద్యం మత్తులో తూలుతూ పాటలు పాడటం.. కేకలు వేయడం చేస్తే ఆ పక్కనే ఉన్న వారిపై నోటి తుంపర్లు పడే ప్రమాదముంది. పబ్ కు వచ్చిన వారిలో ఎవరికైనా కరోన వైరస్ ఉన్నట్టైతే..అది వేరేవారికి సోకే ప్రమాదం పొంచి ఉంటుంది. దాంతో ముందస్తు చర్యల్లో కరోన బారిన పడకుండా ఉండేందుకు పబ్బులను పోలీసులు మూసివేయించారు. మసక మసక చీకట్లో విందులు, చిందులూ జరిగే పబ్బులకు ఇప్పుడు తాళాలు పడ్డాయ్. 

 

మందుబాబులు, మందుభామలతో పబ్బుల్లో నిత్యం న్యూసెన్సుగా ఉండేది. పీకల్థాకా మద్యం మైకంలో తెల్లవార్లు  అసభ్యకర నృత్యాలతో రచ్చ చేస్తుండేవారు. అర్థరాత్రి దాటాక పబ్బులను మూసివేసేందుకు ప్రయత్నిస్తే వారిపై ఎదురు తిరిగిన ఘటనలు గతంలో అనేకం.
కరోనా ఎఫెక్ట్ తోనైనా కొంతకాలం పబ్బులు మూతబడటం మంచిదేనంటున్నారు స్థానికులు. మొత్తంమీద.. గానాబజానాలతో ఉండే పబ్బులు ఇప్పుడు ప్రశాంతంగా మారాయ్..

మరింత సమాచారం తెలుసుకోండి: