వైఎస్సార్సీపీ రాజ్య‌స‌భ సభ్యుడు  వి.విజయసాయి రెడ్డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు సంబంధించిన వివిధ అంశాల‌పై రాజ్యసభలో ప్ర‌స్తావిస్తున్నారు. తాజాగా ఈ రోజు జీరో అవర్‌లో రైల్వే మంత్రికి ఆయ‌న కీల‌క‌ విజ్ఞప్తులు చేశారు. విశాఖపట్నం కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటు ప్రక్రియను వేగిరపరచి త్వరతగతిన కార్యకలాపాలు ప్రారంభిచవలసిందిగా విజ‌య‌సాయిరెడ్డి కోరారు. ``ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో పొందుపరచిన హామీలలో భాగంగా విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాలి. అందుకు అనుగుణంగానే విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే మంత్రి గత ఏడాది ఫిబ్రవరి 27న అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడి ఏడాది కావస్తున్నా ఇప్పటి వరకు కొత్త రైల్వే జోన్‌ కార్యకలాపాలు ఆరంభం కాలేదు` అని విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు.

 

 కొత్త రైల్వే జోన్‌ వలన అనేక పోర్టులు కలిగిన ఆంధ్రప్రదేశ్‌కు రైలు  రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడటంతోపాటు, సరుకుల రవాణా ద్వారా ఆర్థికంగా రాష్ట్రానికి ఊతమిచ్చినట్లుతుందని విజయసాయి రెడ్డి తెలిపారు. ``దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ కార్యకలాపాలు ప్రారంభమైతే ఏటా 13 వేల కోట్ల రూపాయల ఆదాయంతో ఇది దేశంలోనే అత్యంత లాభదాయక రైల్వే జోన్‌ అవుతుంది. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం వంటి పోర్టులకు సేవలందించడం ద్వారా ఈ రైల్వే జోన్‌ అత్యధిక ఆదాయం ఆర్జించే అవకాశం ఉంది. రైల్వే జోన్‌ కార్యకలాపాలు ప్రారంభిస్తే రాష్ట్రంలోని పరిశ్రమలు, వాణిజ్య వ్యాపారాలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అందువలన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి సాధ్యమైనంత త్వరలో కార్యకలాపాలు ప్రారంభించవలసిందిగా రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాం`` అని విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు. 

 

కాగా, మిషన్‌ సోలార్‌ ఛర్ఖా కింద ఆంధ్రప్రదేశ్‌లో సోలార్‌ ఛర్ఖా క్లస్టర్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ సోమవారం రాజ్యసభలో ప్రకటించారు. వైఎస్సార్సీ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. మిషన్‌ సోలార్‌ ఛర్ఖాను ఎంఎస్‌ఎంఈ 2018-19లో ప్రారంభించిందని, దీని కింద దేశంలో 50 సోలార్‌ ఛర్ఖా క్లస్టర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని మంత్రి చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో సోలార్‌ ఛర్ఖా క్లస్టర్‌ ఏర్పాటు ద్వారా మహిళలు, యువతకు ఉపాధి కల్పిస్తూ వారు తమ సొంత కాళ్ళపై నిలబడి అభివృద్ధి చెందాలన్నది మిషన్‌ సోలార్‌ ఛర్ఖా లక్ష్యాలలో మొదటిది. తద్వారా గ్రామీణ ఆర్థిక రంగానికి ఉత్తేజం కల్పిస్తూ గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు జరిగే వలసలను నిలవరించడం, తక్కువ ఖర్చుతో కూడిన వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని గ్రామీణప్రాంత నేత కార్మికులకు అందుబాటులోకి తీసుకురావడం మిషన్‌ ఉద్ధేశాలని మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా ఆమోదించిన 10 ప్రాజెక్ట్‌లలో ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పబోయే సోలార్‌ ఛర్ఖా క్లస్టర్‌ ఒకటని ఆయన చెప్పారు. మిషన్‌ సోలార్‌ ఛర్ఖా ద్వారా లక్ష మందికి నేరుగా ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: