తెలంగాణాలో త్వరలో మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందా…?  కేసీఆర్ కేబినెట్లోకి ఎవ్వ‌రూ ఊహించ‌ని ఓ దుర‌దృష్ట వంతుడికి చోటు ద‌క్క‌నుందా ?  ఇప్ప‌టికే రెండు మూడు బంగారం లాంటి అవ‌కాశాలు కోల్పోయిన ఆ దుర‌దృష్ట వంతుడు అయిన నేత‌కు ఇప్పుడు అయినా అదృష్టం వ‌రిస్తుందా ? అంటే ఆయ‌న వ‌ర్గం సోష‌ల్ మీడియాలో మాత్రం అలాగే ప్ర‌చారం చేసుకుంటోంది. ఇంత‌కు ఎవ‌రా దుర‌దృష్ట వంతుడు ఆ క‌థ ఏంటో  ?  చూద్దాం. 2014 ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలోకి జాయిన్ అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో పార్టీని ఓ రేంజ్‌లో బ‌లోపేతం చేశారు.

 

ఆర్థికంగా బ‌ల‌మైన వ్య‌క్తి కావ‌డంతో డ‌బ్బుకు వెనుకాడ కుండా ఆయ‌న ఖ‌మ్మం వైసీపీ ఎంపీగా పోటీ చేసి సంచ‌ల‌న రీతిలో విజ‌యం సాధించ‌డంతో పాటు ఆ జిల్లాలో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేల‌ను గెలిపించారు. ఆ త‌ర్వాత ముగ్గురు ఎమ్మెల్యేల‌తో క‌లిసి ఆయ‌న టీఆర్ఎస్‌లోకి జంప్ చేసేశారు. ఆ త‌ర్వాత 2018 చివ‌ర్లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఖ‌మ్మం జిల్లాలో ఖ‌మ్మం సీటు త‌ప్పా అన్నింట్లో టీఆర్ఎస్ ఓడిపోయింది. ఈ క్ర‌మంలోనే చాలా మంది పొంగులేటిపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.

 

ఈ క్ర‌మంలోనే ఈ ఫిర్యాదుల‌తో పాటు సామాజిక స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో పొంగులేటికి ఎంపీ సీటు రాలేదు. త‌ర్వాత ఆయ‌న‌కు రాజ్య‌స‌భ వ‌స్తుంద‌నుకున్నా రాలేదు. అంత‌కు ముందు ఆయ‌న్ను ఎమ్మెల్సీని చేసి కేబినెట్లోకి తీసుకుంటార‌ని అనుకున్నా కేసీఆర్ ఖ‌మ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజ‌య్ కుమార్‌కు మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. ఇక మొన్న రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో త‌న‌కే ఎంపీ సీటు వ‌స్తుంద‌ని ఆయ‌న మీడియాలో ఊద‌ర గొట్టించేసుకున్నారు.

 

ఇక కేసీఆర్ ఆయ‌న‌కు షాక్ ఇచ్చి రాజ్య‌స‌భ ఇవ్వ‌లేదు. ఇక త్వ‌ర‌లోనే కేసీఆర్ కేబినెట్ ప్ర‌క్షాళ‌న చేస్తార‌ని.. త‌న కేబినెట్ నుంచి కొంద‌రిని త‌ప్పించేసి మ‌రి కొంద‌రికి మంత్రి ప‌ద‌వులు ఇస్తార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్పుడు ఈ లిస్టులో క‌విత‌తో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్న‌ట్టు ఆయ‌న క్యాంప్ ప్ర‌చారం చేసుకుంటోంది. మ‌రి ఈ ఇద్ద‌రితో పాటు న‌ల్ల‌గొండ జిల్లాకు చెందిన పల్లా రాజేశ్వర్ రెడ్డిని... హైదరాబాద్ కి చెందిన ఒక యువనేతను మంత్రి వర్గంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి అనే ప్రచారం జరుగుతుంది. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజం అవుతుందో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: