నందమూరి బాలకృష్ణ...దివంగత ఎన్టీఆర్ కుమారుడు, టీడీపీ అధినేత చంద్రబాబు బామ్మర్ది& వియ్యంకుడు,  తెలుగు సినీ ఇండస్ట్రీలో అగ్రహీరో, హిందూపురం ఎమ్మెల్యే, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్...అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే, బాలయ్య అర్హతలకు ఏమి లోటు లేదు. అయితే ఇన్ని అర్హతలున్న బాలయ్యకు తెలుగుదేశం పార్టీపై పెద్దగా పట్టు లేదు. ఏదో ఎమ్మెల్యేగా ఉన్నారు తప్ప, ఈయనకు పార్టీలో పెద్దగా విలువ ఉండదు అనే విషయం అందరికీ తెలిసిందే.

 

అందుకనేమో తెలుగుదేశం పార్టీకి ఊహించని షాకులు తగులుతున్న బాలయ్య పట్టించుకోవడం లేదు. ఈ గోలంతా నాకెందుకు అనుకుంటూ సినిమాలు తీసుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోయిన దగ్గర నుంచి బాలయ్య పెద్దగా పార్టీలో పెద్దగా కనబడటం లేదు. ఎప్పుడన్నా అసెంబ్లీ సమావేశాలు లేదా హిందూపురం నియోజకవర్గంలో మాత్రం కనిపిస్తున్నారు. మిగతా సమయమంతా సినిమాలకే కేటాయిస్తున్నారు. ఇక అంతే తప్ప పార్టీలో ఏం జరిగినా, ఎవరు పార్టీ వీడి వెళ్లిపోతున్న బాలయ్య పట్టించుకోవడం లేదు.

 

తాజాగా కూడా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చాలామంది టీడీపీ నేతలు వైసీపీలోకి జంప్ అయిపోయారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ పార్టీలో కొనసాగిన నాయకులు మాజీమంత్రి పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, కరణం బలరామకృష్ణమూర్తిలు పార్టీని వీడిన బాలయ్య సైలెంట్‌గానే ఉన్నారు. అలాగే బొండా ఉమా, బుద్దా వెంకన్నలపై దాడి జరిగిన రెస్పాండ్ అవ్వలేదు. ఆఖరికి తన స్నేహితుడు, కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు పార్టీని వీడిన బాలయ్య దగ్గర నుంచి స్పందన లేదు.  

 

అయితే ఇదే బాలయ్య కొడాలి నాని పార్టీని వీడినప్పుడు, జూనియర్ ఎన్టీఆర్‌ని ప్రశ్నించాడు. కొడాలి నాని చంద్రబాబుని తిట్టడంపై, పార్టీ మారడంపై స్పందించాలని డిమాండ్ చేశాడు. అప్పుడు అలా మాట్లాడిన బాలయ్య, ఇప్పుడు ఆయన స్నేహితుడు కదిరి బాబూరావు పార్టీ మారుతూ, చంద్రబాబుని తిట్టినా ఏ మాత్రం స్పందించలేదు. మొత్తానికైతే బాలయ్య పార్టీతో సంబంధం లేనట్లుగానే ఉంటూ, ఈ గోలంతా నాకెందుకులే అనుకుంటున్నట్లు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: